1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , బుధవారం, 8 డిశెంబరు 2021 (21:29 IST)

హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా కురబలకోట వాసి మృతి

తమిళనాడులో కూలిన రక్షణశాఖ హెలికాప్టర్ ప్రమాదం మృతుల్లో చిత్తూరు జిల్లా కురబలకోట వాసి కూడా ఉన్నాడు. ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సాయితేజ విధులు నిర్వహిస్తుండగా, ఈ హెలికాప్ట‌ర్ దుర్ఘటన జరిగింది. 
 
 
సాయితేజ 1994లో జన్మించారు. 2013లో ఆర్మీలో చేరారు. సాయితేజకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లల చదువుల కోసం నివాసాన్ని మదనపల్లికి మార్చారు. చివరిసారిగా వినాయక చవితికి సాయితేజ స్వగ్రామానికి వెళ్లారు. ఈ రోజు ఉదయం తన భార్యతో సాయితేజ ఫోన్లో మాట్లాడినట్లు సాయితేజ బాబాయ్ సుదర్శన్ తెలిపారు.  ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కన్నుమూశారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది. ఘటనలో రావత్‌తో పాటు ఆయన భార్య సహా 13 మంది చనిపోయారంటూ ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.