గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (12:27 IST)

కేశినేని నాని చాలా మంచి వ్యక్తి... మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం.. వైకాపా ఎంపీ అయోధ్యరామి రెడ్డి

ayodhya ramireddy
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చాలా మంచి వ్యక్తి అని వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి కితాబిచ్చారు. పైగా, వ్యక్తిగతంగా ఆయన నాకు మంచి మిత్రుడని చెప్పారు. ఆయన వైకాపాలోకి వస్తే చాలా సంతోషమని వ్యాఖ్యానించారు. నాని ప్రజల కోసం పని చేసే వ్యక్తి అని చెప్పారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా ఉంటారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి వైకాపాలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని వైకాపా ఎంపీ అన్నారు. 
 
అయితే, ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. ఇటీవలికాలంలో టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేశినేని నాని... వరుసగా వైకాపా ఎమ్మెల్యేలను కలుస్తున్నారు. ఇది టీడీపీ నేతలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ టిక్కెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా డోంట్ కేర్ అని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
పైగా, తన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానం ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని, తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో తనకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరితోనైనా కలిసి పని చేస్తానని ప్రకటించారు. తన మనస్తత్వానికి సెట్ అయితే ఏ పార్టీ అయినా ఓకే అని అన్నారు. ఈ వ్యాఖ్యలు టీడీపీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సమయంలోనే వైకాపా ఎంపీ అయోధ్య రామిరెడ్డి.. కేశినేని నానికి తమ పార్టీలోకి ఆహ్వానించడం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.