సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వైకాపా రంగుల పిచ్చి పీక్ : తిరుపతి గంగమ్మ జాతర అలంకరణను కూడా వదిలిపెట్టలేదు...

jdecoration
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా ప్రభుత్వానికి రంగుల పిచ్చి బాగా పట్టిందంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీటిని నిజం చేసేలా వైకాపా నేతల తీరు కూడా ఉంది. వైకాపా ఆధ్వర్యంలో జరిగే ప్రభుత్వ లేదా ప్రైవేటు కార్యక్రమాల్లో వైకాపా జెండా రంగులు స్పష్టంగా కనిపించేలా అలంకరణలు ఉంటాయి. ఈ అలంకరణలు ఇపుడు జాతరలు, దేవుడి విశేష కార్యక్రమాలకు కూడా పాకింది. తాజాగా తిరుపతి గంగమ్మ జాతరలో ఇదే తరహా అంలకరణ కనిపించింది. 
 
గత కొన్ని రోజులుగా తాతయ్య గుంట గంగమ్మ జాతర జరుగుతోంది. అయితే, ఆలయం ముందు చేసిన అలంకారం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జగన్ అనే అర్థ వచ్చేలా 'J' అని ఇంగ్లీష్ అక్షరం రాసి దానిపక్కన తుపాకీ బొమ్మ వేశారు. ఆ తర్వాత అటూ ఇటూగా వైకాపా జెండాను వేశారు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
దీనిపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? అంటూ మండిపడ్డారు. దేవుని సన్నిధిలో ఈ గన్ సంస్కృత్తి ఏంటి?, వైకాపా జెండా గుర్తులు ఏంటి? అంటూ నిలదీశారు. పిచ్చిపట్టిందా? 'J' అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ల దగ్గర ఇలాంటి పిచ్చి వేషాలా? అంటూ ఆయన నిప్పులు చెరిగారు.