గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 మే 2023 (08:48 IST)

'అస్సాం లేడీ సింగం' రాభా రోడ్డు ప్రమాదంలో మృతి

jummoni rabha
అస్సాం రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో అస్సాం లేడీ సింగంగా పేరుగాంచిన పోలీస్ అధికారిణి జూన్‌మోనీ రాభా దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
రాభా తన ప్రైవేటు వాహనంలో ప్రయాణిస్తుండగా, అర్థరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్ లారీ కారును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన రాభాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. కాగా, ప్రమాద సమయంలో సివిల్ దుస్తుల్లో ఉన్న ఆమె ఎక్కడకు వెళ్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. 
 
ప్రస్తుతం నాగాన్ జిల్లాలోని మోరికొలాంగ్ పోలీస్ ఔట్ పోస్టు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఎస్ఐ రాభా... విధుల్లో మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తారు. తన పనితీరుతో అస్సా లేడీ సింగంగా, దబాంగ్ పోలీస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేసమయంలో ఆమెపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై గత యేడాది జూన్ నెలలో అరెస్టు అయిన రాభా.. కొంతకాలం పాటు సస్పెన్షన్‌లో ఉన్నారు. అప్పట్లో ఆమె ఓ బీజేపీ ఎమ్మెల్యేతో జరిగిన సంభాషణ బయటకు లీకై పెను దుమారాన్నే రేపింది.