ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 15 జులై 2020 (09:16 IST)

శాసనమండలి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తా: ఎమ్మెల్సీ డొక్కా

శాసనమండలి సభ్యునిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం విలువలు పాటిస్తూ, పెద్దల సభ గౌరవాన్ని మరింత ఇనుమడింప చేస్తానని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తెలిపారు. శాసనమండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మాట్లాడారు.

తనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. పేదలకు సంక్షేమం అందించాలనే ముఖ్యమంత్రి ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించానని, తన పదవీ కాలంలో చట్ట సభలకు విధిగా హాజరయ్యానన్నారు.

ఈ పర్యాయం కూడా మరింత బాధ్యతతో పెద్దల సభలో హుందాతనంగా వ్యవహరిస్తానని డొక్కా మాణిక్య వరప్రసాద్ వెల్లడించారు. అంతకుముందు ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ తో శాసనమండలి చైర్మన్ ఎంఎ.షరీఫ్ తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు.

అనంతరం ఆయనకు శాసనమండలి సభ్యుల ప్రవర్తనా నియమావళి కిట్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె.కనకారావు తదితరలు పాల్గొన్నారు.