శ్రీకాళహస్తిలో మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం - వీడియో వైరల్
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను శరీరంతో పాటు తన కారుపై పోసి అగ్గిపుల్ల గీసి నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఆ మహిళా అఘోరీని అడ్డుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి ఆలయ అధికారులు అనుమతించలేదు. దీనికి నిరసనగా ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత మహిళా అఘోరి ముత్యాలమ్మ ఆలయం సందర్శించారు. ఆ తర్వాత నిత్యం ఏదో ఒక ఆలయాన్ని సందర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సనాతన ధర్మం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని పోలీసులు మహిళా అఘోరిని రాష్ట్రం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఫలితంగా మహారాష్ట్రకు వెళ్లిన అఘోరి.. అక్కడి ఆలయాలను సందర్శించుకున్నారు.
ఈ క్రమంలోనే మహిళా అఘోరి గురువారం అకస్మాత్తుగా శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. స్వామి వారి దర్శనం కోసం వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం చెందిన మహిళా అఘోరి.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టిపరిస్థితుల్లోనూ స్వామిని దర్శించుకోకుండా వెళ్లబోనని, అవసరమైతే ఆత్మార్పణ చేసుకుంటానని బెదిరించారు. అయినా పోలీసులు గుడి లోపలికి అనుమతించకపోవడంతో కారు వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. స్థానిక మహిళలతో కలిసి అఘోరిపై నీళ్లు కుమ్మరించారు.