శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మార్చి 2024 (15:01 IST)

సచివాలయం తాకట్టుపెట్టాం.. అయితే ఏంటి.. అవసరమైతే రాష్ట్రాన్ని కూడా తనాఖా పెట్టేస్తాం : కొడాలి నాని

kodali nani
రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే, మాజీ మంత్రి, వైకాపా నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం సచివాలయాన్ని తాకట్టు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదంటున్నారు. పైగా, సచివాలయాన్ని తాకట్టుపెట్టిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ఒక్క సచివాలయం ఏంటి.. అవసరమైతే రాష్ట్రాన్ని కూడా తనఖా పెట్టేస్తామని ఆయన చెప్పారు. పైగా, సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా? అంటూ ప్రశ్నించారు. మాకు అవసరం ఉంది, తాకట్టు పెట్టుకుంటాం, నీ బాబు సొత్తా అది? అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 
 
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నారని, అందువల్ల పవన్‌ను జనసైనికులే రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కల్యాణ్‌ను ఓడించేది తెలుగుదేశం పార్టీయేనని, ఈ విషయం ఎన్నికల తర్వాత అందరికీ అర్థమవుతుందన్నారు. అభిమానులు అప్రమత్తం కావాలని, లేకపోతే పవన్ కల్యాణ్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని కొడాలి నాని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్‌ను జనసైనికులే రక్షించుకోవాలని తెలిపారు. 
 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఓట్లు కావాలే తప్ప సీట్లు ఇవ్వరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మూడు శాతం ఓట్లు ఉన్న తన సామాజిక వర్గానికి చంద్రబాబు 30 సీట్లు ఇచ్చుకున్నాడని, 20 శాతం ఉన్న వర్గానికి మాత్రం 24 సీట్లే ఇచ్చాడని విమర్శించారు. జనసేనకు ఇచ్చిన ఆ 24 సీట్లలో 10 సీట్లు ఖచ్చితంగా ఓడిపోయే సీట్లేనని వివరించారు. అలాంటి సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని, తీసుకోవడానికి పవన్ కల్యాణ్‌కైనా సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.