నేటి నుంచి ఏపీలో పదో తరగతి హాల్ టిక్కెట్ల జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డులు (హాల్ టిక్కెట్లు) జారీ సోమవారం నుంచి జరుగనుంది. ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి హాల్ టిక్కెట్లను జారీ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి bse.ap.gov.in అనే వెబ్‌సైట్లలో హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
రాష్ట్రంలోని పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులు కూడా స్వయంగా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థి తన పేరు, స్కూలు పేరు, జిల్లా, ఇతర వివరాలతో పాటు పుట్టిన తేదీ వివరాలతో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ పేర్కొంది. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఎన్నికలను దృష్టలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహిస్తున్నారు.
మరో పదేళ్ళపాటు హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి : హైకోర్టులో పిల్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన తర్వాత హైదరాబాద్ నగరాన్ని నవ్యాంధ్రకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ గడువు త్వరలోనే తీరిపోనుంది. దీంతో మరో పదేళ్లపాటు కామన్ కేపిటల్‌గా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్ కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్ 2వ తేదీతో ముగుస్తున్నా, ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొన్నారు.
అందువల్ల 2034 జూన్ 2 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించాలన్నారు. విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన వ్యవహారం వివాదాలకు దారి తీసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తనకున్న అధికారాలకు అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమైందన్నారు. విభజన చట్టం అమలులో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం దృష్టి పెట్టకపోవడంతో వివాదాలు కోర్టులకు చేరుతున్నాయన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడే అప్పుల విభజన వివాదాన్ని పరిష్కరించాలని పిటిషనర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని నిబంధనలు అమలు కానందున హైదరాబాద్ సిటీని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరే హక్కు ఏపీకి ఉందన్నారు.