బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (07:54 IST)

స్వేచ్ఛగా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.. ఏపీ హోంశాఖ మంత్రి

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సోమవారం వెలగపూడి సెక్రటేరియట్ లోని ప్రచార విభాగంలో మంత్రి మేకతోటి సుచరిత డీజీపీ గౌతమ్ సవాంగ్ తో కలిసి విలేఖర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు.

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం జరగుతోందని... ఫిర్యాదులకు 15 రోజుల్లో పరిష్కారం చూపించాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు పడి రైతులు, రైతు కూలీలు పనుల్లో నిమగ్నమై.. నిరుద్యోగులు పోటీ పరీక్షలు రాస్తూ రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉంటే కొందరికి నచ్చడం లేదన్నారు.

అందులో భాగంగానే గుంటూరు జిల్లాలో భౌతికదాడులు జరుగుతున్నాయని, భయాందోళనతో ప్రజలు వలసలు వెళ్తున్నారన్న ఆరోపణలు చేస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు పల్నాడు ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. పల్నాడులో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు.

పల్నాడులో పెయిడ్‌ ఆర్టిస్టులతో కొందరు శిబిరాలు పెడుతూ ప్రశాంతతకు భంగం కలిగించాలని చూస్తున్నారన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలోని పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అక్రమ మైనింగ్‌ గురించి ఫిర్యాదు చేసినందుకు ఒక వ్యక్తిని దారుణంగా హింసించారన్న విషయం మంత్రి వివరించారు.

గత ప్రభుత్వ పాలనలో సదరు వ్యక్తిని చిత్ర హింసలకు గురిచేశారని.. ఆయన ఫొటోలను మీడియా ముఖంగా చూపించారు. అదే విధంగా సదరు వ్యక్తిని కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని... ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారన్న విషయం మంత్రి గుర్తుచేశారు.

గత ప్రభుత్వ పాలనలో ఇలాంటి కేసులు  మరెన్నో  నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ తరహా భయానక పరిస్థితులు లేవని, నేరాలు తగ్గి శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని మంత్రి సుచరిత అన్నారు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం పల్నాడు, గురజాడ ప్రాంతంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయన్నారు.

ఇటువంటి సమయంలో కొందరు పెయిడ్‌ ఆర్టిస్టులను తీసుకొచ్చి గ్రామాల్లో తమను ఉండనివ్వడం లేదంటూ పునారావాస శిబిరాలు పెడుతున్నారన్నారు. గత ఐదేళ్లలో ఎలాంటి ఘోరాలు జరిగాయో ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి పల్నాడు ప్రాంతాన్ని అధికారులు ఎప్పటికప్పుడు  పరిశీలిస్తున్నారన్నారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఓఎస్డీ ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితులు తమ సమస్యలను ఓఎస్డీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నిజమైన బాధితులకు తప్పకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు వెళ్లి పరిస్థితులు గమనించి నిజంగా బాధితులు ఉంటే వారిని పోలీసు రక్షణతో గ్రామాల్లోకి తీసుకువెళ్తామన్నారు.

కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు తప్పు చేసిన వారిని ఉపేక్షించకూడదని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. నిజానికి ఎన్నికలు ముగిసిన తర్వాత పల్నాడులో మొత్తం 79 రాజకీయ కేసులు నమోదయ్యాయని అందులో 49 కేసులు ప్రతిపక్ష టీడీపీ  పెట్టినవని, 36 కేసులు వైఎస్సార్సీపీ పెట్టినవని వెల్లడించారు. 
 
శాంతిభద్రతలను కాపాడాలన్నదే మా ఉద్దేశం: డీజీపీ గౌతమ్ సవాంగ్
పల్నాడులో 144 సెక్షన్ కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం పల్నాడులో శాంతిభద్రతలు ప్రశాంతంగా ఉన్నాయన్నారు. ఎవరైనా రెచ్చగొట్టే పరిస్థితులు కల్పిస్తే సహించబోమన్నారు. పల్నాడులో ర్యాలీలు నిర్వహించాలనుకొంటే అనుమతి తప్పనిసరన్నారు.

ప్రస్తుతం పల్నాడులో ఊరేగింపులకు అనుమతి లేదన్నారు. శాంతిభద్రతలను కాపాడాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐజీ వినీత్ బ్రిజ్ లాల్, గుంటూరు  అర్బన్ ఎస్పీ పీహెచ్ డీ రామకృష్ణ, గుంటూరు రూరల్ ఎస్పీ జయలక్ష్మీ పాల్గొన్నారు.