తిరుపతిలో కాదు బెజవాడలోనే ప్రమాణ స్వీకారం.. నవరత్నాలన్నీ అమలుచేస్తాం : జగన్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన స్పందనను తెలియజేశారు. విజయవాడలోని తాడేపల్లిలో ఉన్న వైకాపా పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
ఈ ఎన్నికల ఫలితాలు తనపై మరింత బాధ్యతను పెంచారన్నారు. రాష్ట్ర ప్రజలు ఇంత గొప్ప తీర్పునిచ్చి తనపై మరింత బాధ్యత ఉంచారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్నెల్లు లేదా ఒక యేడాదిలోపే "జగన్ మోహన్ రెడ్డి" మంచి ముఖ్యమంత్రి అని ప్రజల చేత అనిపించుకుంటానని చెప్పారు.
అన్నిటికంటే ప్రధానంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతుందన్నారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలోనే తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉంటుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి తీర్పునిచ్చిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.