మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 29 నవంబరు 2021 (15:15 IST)

వైఎస్ వివేకా హత్య కేసులో మ‌లుపు... సిబీఐ నుంచి ప్రాణహాని ఉందంటూ...

మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఇపుడు కొత్త మలుపు తిరిగింది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్పను గంగాధర్ రెడ్డి కలిసి కొత్త వివాదానికి తెర‌లేపారు. ఏకంగా సీబీఐపైనే ఫిర్యాదు చేశారు.
 
 
సీబీఐ నుంచి, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ఫక్కీరప్పను బాధితుడు గంగాధర్ రెడ్డి కోరారు. త‌న‌కు ప‌ది కోట్లు ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందని గంగాధర్ రెడ్డి చెపుతున్నాడు. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ నుంచి త‌న‌కు ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ని బాధితుడు ఫిర్యాదు చేశాడు.

 
వారి ఒత్తిడితో తాను ప్రాణ‌భ‌యంతో వ‌ణికిపోతున్నాన‌ని, వై.ఎస్. వివేకాను తానే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశార‌ని కూడా గంగాధ‌ర్ రెడ్డి ఆరోపించారు. వివేకా హత్య కేసులో తన ప్ర‌మేయం లేదని, దానికి త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేదిలేద‌ని గంగాధర్ రెడ్డి పేర్కొంటున్నాడు.
 
 
దీనిపై ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ, వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశార‌ని, ఆయ‌న‌కు రక్షణ కల్పిస్తామ‌న్నారు. సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఆయ‌న ఫిర్యాదు చేశార‌ని, దీనిపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామ‌న్నారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్  చెబుతున్నార‌ని, గంగాధర్ రెడ్డి ఫిర్యాదులోని అన్ని అంశాలపై విచారణ చేస్తామ‌న్నారు.