శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (22:02 IST)

కౌన్సిలర్ తాళ్లూరు సురేష్ దారుణ హత్య.. పుట్టినరోజే చివరి రోజుగా..?

నెల్లూరు జిల్లా ప్రశాంత పట్టణంలో కౌన్సిలర్ దారుణ హత్యకు గురికావడం సూళ్లూరుపేటలో కలకలం రేపింది. సూళ్లూరుపేటలో 19వ వార్డు కౌన్సిలర్ తాళ్లూరు సురేష్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక రైల్వే గేట్ సమీపంలోని ఓ కారులో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. 
 
దుండగులు అక్కడే హత్య చేశారా?.. లేక ఇంకెక్కడైనా హతమార్చి రైల్వే స్టేషన్ సమీపంలో వదిలివెళ్లారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్రాహ్మణ వీధిలో ఉంటున్న సురేష్ ఇవాళ జన్మదిన వేడుకలు జరుపుకోనున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకోవడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది.
 
ఈ దారుణ హత్య పట్టణంలో చర్చనీయాంశమైంది. కారులో నిర్జీవంగా పడి ఉన్న సురేష్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హత్యకు గల కారణాలు ఏంటి...? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అధికార పార్టీకి చెందిన సురేష్ స్థానికులతో సఖ్యతగా ఉండేవారన్న అభిప్రాయం ఉంది. 
 
ఇవాళ పుట్టినరోజు కావడంతో తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్న సమయంలో ఈ దారుణం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సురేష్ తన కారును షెడ్ లో పెట్టే సమయంలో అత్యంత దారుణంగా హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. పుట్టిన రోజునే సురేష్ ను హత్య చేయడంపై బలమైన కారణాలు ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.