సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (18:37 IST)

వైసీపీ అక్రమ గ్రావెల్ తవ్వకాలను పరిశీలించిన టీడీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అక్రమ మైనింగ్ ను టీడీపీ బృందం పరిశీలించింది. అనకాపల్లి, అనపర్తి, గన్నవరం, పామర్రు, నందిగామ ప్రాంతాల్లో టీడీపీ నేత‌లు పర్యటించారు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్ ను హౌస్ అరెస్టు చేయ‌డంతో, పోలీసులు అరెస్టు చేస్తారన్న ముందస్తు సమాచారంతో చేకచక్యంగా తప్పించుకుని పామర్రు వెళ్లి పరిశీలించిన కొందరు నేతలు వైసీపీ అక్రమ తవ్వకాలను బయటపెట్టారు.
 
 
రాష్ట్రంలో వైసీపీ నేతలు పాల్పడుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాలను టీడీపీ నేతల బృందం పరిశీలించింది. అనకాపల్లి, అనపర్తి, గన్నవరం, పామర్రు, నందిగామ ప్రాంతాల్లో జరుగుతున్న మైనింగ్ ప్రాంతాలను పార్టీ నేతలు శుక్రవారం పరిశీలించారు. గన్నవరం నుండి కొండపావులూరుకు బయలుదేరిన బచ్చుల అర్జునుడును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై బచ్చుల ఆగ్రహం వ్యక్తం చేశారు. లంకపల్లి వెళ్తున్న మాజీఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ నూ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ ప్రాంతాలను పరిశీలించారు.
 
 
పామర్రులోని లంకపల్లి ప్రాంతంలో మైనింగ్‌లో దేశంలోనే ఏపీని మొదటి స్థానంలో నిలిపిన ఘనత వైసీపీ నాయకులదేనని టీడీపీ నేతల బృందం ఆరోపించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే మైనింగ్ దోపిడీలు రోజు రోజుకూ అడ్డూఅదుప లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పామర్రు నియోజకవర్గంలోని లంకపల్లిలో వైకాపా నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని తెదేపా నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ, పామర్రు ఇంచార్జి వర్ల కుమార్ రాజా, పెడన ఇంచార్జి కాగిత కృష్ణప్రసాద్, పార్లమెంట్ కమిటీ నాయకులు, నియోజక వర్గంలోని నాయకులతో కలిసి సందర్శించారు. 
 
 
లంకపల్లి మైనింగ్ ప్రాంత పరిశీలనకు బయలుదేరిని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాదర్ పోలీసులు హౌస్ అరెస్టు చేయడంపై మండిపడ్డారు.  తమను పోలీసులు అడ్డుకుంటారన్న సమాచారంతో వారి కంట పడకుండా ప్రణాళిక ప్రకారం విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు  నెట్టెం రఘురాం సూచనతో మీడియాను వెంట తీసుకెళ్లి మైనింగ్ జరుగుతున్న తీరును కొందరు నేతలు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... నాడు పాదయాత్రలో ఊరురు తిరిగి టీడీపీ1500 వందలకు ట్రాక్టర్ ఇసుక ఇస్తే అవినీతి అని గుండెలు బాదుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు సొంత పార్టీ మంత్రులు ఇదే ఇసుకను రూ.8 వేల నుండి రూ.10 వేలకు అమ్ముతుంటే ఏ కలుగులో దాక్కున్నారని ప్రశ్నించారు. 
 
 
ఇసుక విధానాన్ని మార్చి కార్మికుల పొట్టకొట్టి, నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారని అన్నారు. పక్క రాష్ట్రాలకు వందలాది లారీలు తరలిస్తూ అక్రమ సంపాదన చేస్తున్నారని తెలిపారు. జిల్లా మంత్రి కొడాలి నాని అక్రమ సంపాదనను హైదరాబాద్ లో సీజ్ చేశారు. ఇలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంత అక్రమార్జన చేస్తున్నారో, ఎంతమంది పేదల పొట్టకొడుతున్నారు? ఒకసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు. వీరి దోపిడీని ప్రశ్నిస్తున్న తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేశారు.  ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేవరకు పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు.  రాష్ట్రంలో వైసీపీ నాయకులు శాండ్, ల్యాండ్ రూపంలో రాష్ట్రాన్ని దోచేస్తూ రాష్ట్ర ప్రజలకు బ్యాండు వాయిస్తున్నారని అన్నారు. 
 
 
గన్నవరం నియోజకవర్గం, కొండపావులూరులో వైసీపీ నేతలు చేస్తున్న గ్రావెల్ పరిశీలనకు బయలు దేరిన గన్నవరం ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడును ఇంటివద్దే పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ పరిశీలించేందుకు వెళ్తున్న తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని అర్జునుడు మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి దిగిపోయే సమయం దగ్గరపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


పోలీసులు అరెస్టుకుపూనుకున్నప్పటికీ రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి మండవ లక్ష్మి, మచిలీపట్నం పార్లెమెంట్ తెదేపా కార్యదర్శి జూపల్లి సురేష్, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవి, గన్నవరం మండల తెదేపా ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, ఉపాధ్యక్షులు కంచర్ల ఈశ్వరరావు, కొండపావులూరు ఎంపీటీసీ కొవ్వలి రాజు, తెలుగుయువత నాయకులు అట్లూరి రామ్ కిరణ్, తదితరులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కొండపావులూరు గ్రామ రెవిన్యూ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని  పరిశీలించారు.