బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (14:10 IST)

సీఎం జగన్ ఆ పని చేస్తే ఎంపీ పదవికి రాజీనామా : ఆర్ఆర్ఆర్ ప్రకటన

నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అధికార వైకాపాకు చెందిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనపై అనర్హత వేటువేయాలంటూ వైకాపా ఎంపీలు ఢిల్లీలో చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. తన కోసం వైకాపా నేతలు పడుతున్న పాట్లను చూస్తుంటే తనకే జాలి వేస్తుందన్నారు. 
 
అయితే, తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కానీ, ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తనపై అనర్హత వేటు వేయకపోయినా తానే రాజీనామా చేస్తానని తెలిపారు. తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని, తద్వారా వైకాపాపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతుందన్నారు. 
 
ప్రస్తుతం సీఎం జగన్ రెడ్డి పాలనలో ఏపీలోని అన్ని రంగాల వారు, అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. వారిని ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తుందో తనకు అర్థం కావడం లేదన్నారు.