కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు మళ్ళీ అక్కడి క్యాడర్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నారు. కోవిడ్ మూడో వేవ్ వస్తున్న తరుణంలో కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో
50 లక్షల రూపాయల ఖర్చుతో ఎన్టీఆర్ ట్రస్ట్ నెలకొల్పిన ఆక్సిజన్ ప్లాంట్ ను చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏ విపత్తు వచ్చినా ఎన్టీయార్ ట్రస్ట్ నుంచి సేవలు అందుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో ట్రస్ట్ సేవలు ప్రజలను ఆదుకున్నాయని, కుప్పం ఆసుపత్రిలో తాము ప్లాంట్ పెడితే, దానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇతర ఆసుపత్రుల్లో ప్లాంట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
వరద బాధితులను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదుకుందని, వరదల్లో కుటుంబ సభ్యులను కోల్పోయిన 48 కుటుంబాలకు ట్రస్ట్ ఆర్ధిక సాయం చేసిందన్నారు. తన భార్య భువనేశ్వరి బాధిత కుటుంబానికి లక్ష చొప్పున అందించారని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటి ఇతర సంస్థలు ఆపద సమయంలో పేదలకు అండగా నిలవాలన్నారు.