జీరో అవర్లో ఢీ అంటే ఢీ అన్న ఎంపీలు రఘురామ, మిధున్ రెడ్డి
లోక్ సభలో ఒకేపార్టీకి చెందిన వైసీపీ ఎంపీలు రఘురామ, మిధున్ రెడ్డి ఢీ అంటే ఢీ అన్నారు. ఇద్దరూ జీరో అవర్ లో కొట్లాడుకున్నారు. అమరావతి రైతుల మహాపాద యాత్రకు పోలీసుల అడ్డంకులు కల్పించడాన్ని ఎంపీ రఘురామ తప్పు పట్టారు. దీనితో రఘురామ వ్యాఖ్యలను వైసీపి లోక్ సభాపక్ష నేత మిధున్ రెడ్డి ఖండించారు.
గాంధేయ పద్దతిలో రైతులు చేస్తున్న మహా పాద యాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని ఎంపీ రఘురామ అన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా, పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, భూములు ఇచ్చిన రైతులు గాంధేయ మార్గంలో జరుపుతున్నమహా పాదయాత్రకు పోలీసులు తీవ్రమైన అడ్డంకులు సృష్టించడమే కాకుండా రైతులను తీవ్రంగా హింసిస్తున్నారన్న ఎంపీ రఘురామ ఆరోపించారు.
శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ఎంపీ రఘురామ చెప్పారు. దీనితో రఘురామ ప్రసంగాన్ని వైసీపి ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిబిఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బిజెపిలో చేరేందుకు తహతహలాడుతున్నాడన్న ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. ఎంపీ రఘురామపై ఉన్న సిబిఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని మిధున్ రెడ్డి డిమాండ్ చేశారు.