శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (12:50 IST)

ఆ పదాన్ని రాష్ట్రపతికి ఎలా చెప్పాలని... చాలా సంకోచించాం!

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో వైసీపీ ఎంపీలు మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో భేటీ అయ్యారు. అనంతరం వైసీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ, టీడీపీ నాయకులు వాడుతున్న భాష, ప్రజా వ్యతిరేక విధానాలను, అధికార పదవుల్లో ఉన్న వారిపై వాడుతున్న రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్న వివరాలను రాష్ట్రపతికి వివరించామన్నారు. 
 
 
చంద్రబాబు తప్పులను వివరించడానికే రాష్ట్రపతిని కలిసామని తెలిపారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని కలిశారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎలా తాకట్టు పెట్టారో రాష్ట్రపతికి వివరించామన్నారు. టీడీపీ కల్చర్ బూతుల కల్చర్ అని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు మాట్లాడేది బూతు భాష అని అన్నారు. టీడీపీ అనడం కన్నా తెలుగు బూతుల పార్టీ అంటే సమంజసంగా ఉంటుందని ఎంపీ దుయ్యబట్టారు. బోసిడికే అన్న పదాన్ని రాష్ట్రపతికి ఎలా చెప్పాలన్న దానిపై చాలా సంకోచించామని తెలిపారు.

 
వైసీపీ సంస్కారవంతమైన పార్టీ అని అన్నారు. పట్టాభి వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకపోవడం సంస్కారహీనత్వానికి నిదర్శనమన్నారు. పట్టాభి బోసిడికే వ్యాఖ్యలను చంద్రబాబు రాష్ట్రపతికి చెప్పలేదని అన్నారు. ఇలాంటి భాష వాడతారా అని రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెప్పారు. బద్వేల్‌లో టీడీపీ పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయిందని వ్యాఖ్యానించారు. 
 
 
బద్వేల్‌లో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఇక రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కాబోతోందని తెలిపారు. టీడీపీ నేతలు టెర్రరిస్టులుగా తయారై రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ టీడీపీ పిచ్చి పార్టీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. కోర్టు ధిక్కరణ చట్టం 1971 తరహాలో రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారిని దూషిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం చేయాలని కేంద్ర న్యాయ శాఖకు సూచించాలని రాష్ట్రపతిని కోరామని, తమ అభ్యర్ధనలపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.