సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (12:18 IST)

బద్వేల్‌లో వైకాపా అభ్యర్థి ఘన విజయం

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. అయితే, ఈ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి డాక్టర్‌ దాసరి సుధ విజ‌యం ఖ‌రారైంది. ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి వైసీపీకి మొత్తం 84,682 ఓట్లు, బీజేపీకి 16,190 ఓట్లు వ‌చ్చాయి. అలాగే, కాంగ్రెస్‌కు 5,026 ఓట్లు, నోటాకు 2,830 ఓట్లు వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు.
 
ఎనిమిదో రౌండ్‌లో వైసీపీకి 9,691 ఓట్లు, బీజేపీకి 1,964 ఓట్లు, కాంగ్రెస్‌కు 774, నోటాకు 364 ఓట్లు ద‌క్కాయి. ఎనిమిది రౌండ్లు ముగిసే స‌రికే వైసీపీ 68,492 ఓట్ల ఆధిక్యంలో ఉండ‌డంతో ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. ఓట్ల లెక్కింపు తుది ద‌శ‌లో ఉంది. ఇప్ప‌టికే పూర్తి ఆధిక్యంలో సుధ ఉండ‌డంతో వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు మొద‌లు పెట్టారు.
 
అంతకుముందు ఏడో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 60,785 మెజారిటీ సాధించారు. ఏడో రౌండ్ లో ఆమెకు 8,741 ఓట్ల ఆధిక్యం లభించింది. ఆమెకు ఏడు రౌండ్లు కలిపి 74,991 ఓట్లు పోలయ్యాయి.
 
బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ కు 14,165 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కమలమ్మ 4,252 ఓట్లు సాధించారు. కాగా, ఈ ఏడాది మార్చిలో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.