ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మార్చి 2023 (11:33 IST)

తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు సజ్జల ఎలా చెబుతారు: వైకాపా ఎమ్మెల్యే ఆనం

anam ramanarayana reddy
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్‌‍కు పాల్పడినట్టు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైకాపా రెబెల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తనతో పాటు మరో ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు ఆరోపిస్తూ తమను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఆయన ఖండించారు. దీనిపై ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారంగా ఓటు వేశామని చెప్పారు. అత్యంత రహస్యంగా జరిగే పోలింగ్‌లో తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 
 
"ఆనం రామనారాయణ రెడ్డి అనే అతను మా ఎమ్మెల్యేనే కాదు. మేం అతడిని ఓటు అడగలేదు" అని సజ్జలతో పాటు వైకాపా నేతలు చెప్పారనీ, కానీ ఫలితాలు వచ్చిన తర్వాత తాను రూ.20 కోట్లు తీసుకుని క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డానని నిరాధారమన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. 
 
విలేఖరిగా పని చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సజ్జల తనకు తెలుసని, ఆయన ఎలా ఎదిగాడో తనకు తెలుసని చెప్పారు. కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా సంపాదించారో చెప్పాలని సజ్జలను మాజీ మంత్రి ఆనం నిలదీశారు. అందరూ తనలాగే ఉంటారని అనుకుంటే ఎలాగని ఎద్దేవా చేశారు. 
 
డబ్బు తీసుకుని ఓటేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు పోస్టుకు సజ్జల ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారని, మిగిలిన సలహాదారుల నుంచి ఎన్నెన్ని కోట్లాది రూపాయలు వసూలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.