శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (14:31 IST)

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : 117 అసెంబ్లీ, 17 లోక్‌‍సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు!

congress flag
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తులు చేస్తుంది. ఇందుకోసం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇందులో 117 అసెంబ్లీ స్థానాలకు 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 117 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మరో 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. 
 
కాగా, కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్‌ షర్మిల, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు సత్యారెడ్డి (విశాఖపట్నం), పళ్లంరాజు (కాకినాడ), జేడీ శీలం (బాపట్ల) అభ్యర్థిత్వాలు ఖరారైనట్లు తెలిసింది. పెండింగ్‌లో ఉన్న పార్లమెంట్ స్థానాల్లో నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీకి పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. 
 
సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను ముక్కలై చెత్తలోకి చేరిపోతుంది : చంద్రబాబు  
 
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను ముక్కలై చెత్తలోకి చేరిపోవడం ఖాయమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా, ఆయన ఆదివారం ఎమ్మిగనూరులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ సారి ఎన్నికల్లో ఫ్యాన్‌ ముక్కలై చెత్తకుప్పలోకి పోవడం ఖాయమన్నారు. 
 
'నమ్మినోళ్లను నట్టేట ముంచే వ్యక్తి జగన్‌. భారతీయ జనతా పార్టీతో తాత్కాలిక పొత్తు అంటూ నా పేరుతో లేఖ రాసి సోషల్‌మీడియాలో వైకాపా దుష్ప్రచారం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే బీసీ ఉంది. మాది పేదల పక్షం.. మీతోనే ఉంటాం. వైకాపాలో ఒకే వర్గానికి 48 సీట్లు ఇచ్చి సామాజిక న్యాయం అంటున్నారు. అది భూస్వాములు, పెత్తందారుల పార్టీ.
 
వైకాపా హయాంలో రాయలసీమలో 102 ప్రాజెక్టులు రద్దు చేశారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమ దశ, దిశ మారుస్తాం. రాయలసీమ ద్రోహి జగన్‌కు ఒక్క ఓటు కూడా వేయవద్దు. ఆయనకు ఓటు వేస్తే మన నెత్తిన మనమే చెత్త వేసుకున్నట్లు. 
 
సామాజిక విప్లవం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్‌. అన్ని వర్గాల పేదలను పైకి తీసుకొచ్చిన పార్టీ తెదేపా. వెనుకబడిన వర్గాలకు రూ.1.5 లక్షల కోట్లతో సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేస్తాం. చట్టపరంగా కులగణన నిర్వహిస్తాం. దామాషా ప్రకారం నిధులు ఖర్చు చేస్తాం. కురబలను ఎస్సీ, బోయలను ఎస్టీల్లో చేర్చేందుకు కృషి చేస్తాం. ఎమ్మిగనూరుకు టెక్స్‌టైల్‌ పార్కు తీసుకువస్తాం' అని చంద్రబాబు హామీ ఇచ్చారు.