వైకాపాకు షాక్.. ఏపీలో పింఛన్ల పంపిణీకి వలంటీర్లు తప్పించిన ఈసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు గట్టి షాక్ తగిలింది. రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో ఉన్న వలంటీర్లు తమను గెలిపిస్తారని గట్టి నమ్మకంతో ఉన్న వైకాపా నేతలకు ఎన్నికల సంఘం షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల ఒకటో తేదీన అర్హులైన వారికి పంపిణీ చేసే పింఛన్ల పంపిణీ నుంచి వలంటీర్లను తప్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. నగదు పంపిణీ పథకాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని సూచన చేసింది. అలాగే, ఇప్పటివరకు వలంటీర్లు ఉపయోగిస్తున్న ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లను కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముుఖేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ వలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు వెల్లడించారు. వలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, మొబైల్ తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయించాలని ఈసీ ఆదేశించినట్లు మీనా తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను, నగదు పంపిణీ పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని ఈసీ సూచించినట్లు వెల్లడించారు. నగదు పంపిణీలో వలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్) పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పింఛన్ల పంపిణీకి వలంటీర్లను పక్కనబెట్టి... ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని ఆదేశించింది.
పథకాల పంపిణీ నుంచి వలంటీర్లను దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ(సీఎఫ్) స్వాగతించింది. శనివారం సీఎఫ్ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్ల జోక్యాన్ని పూర్తిగా లేకుండా చేయాలంటూ సీఎఫ్డీ గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధికార వైసీపీ రాజకీయ ఆకాంక్షల మేరకు వలంటీర్ల వ్యవస్థ పనిచేసే ప్రమాదముందని హెచ్చరించినట్టు పేర్కొన్నారు.