శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (07:51 IST)

10లక్షల మంది రైతులకు అన్యాయం.. తెదేపా

అధికారంలోకి రాకముందు ప్రతి రైతుకి ఏటా మే నెలలోనే రూ.12,500 ఇస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తానే రైతులను ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడటం  హాస్యాస్పదంగా ఉందని టీడీపీ సీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఎద్దేవా చేశారు.

మంగళవారం పార్టీ రాష్ట్రకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీని, అధికారం చేపట్టాక తుంగలోతొక్కేశాడన్నారు. జూలై 09, 2017న గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్‌ మాట్లాడుతూ, '' 5 ఎకరాల్లోపు ఉన్న ప్రతిరైతుకు, సన్న, చిన్నకారు పేదరైతులందరికీ, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50వేలు ఇస్తాను, ఏటా మేనెలలోనే రూ.12,500 అందచేస్తాను'' అనిచెప్పి, నేడు రైతుభరోసా ప్రారంభం సందర్భంగా విడతలవారీగా పీఎంకిసాన్‌ సమ్మాన్‌యోజన పథకం కింద ఇచ్చే రూ.6వేలను కలిపి ఇస్తున్నట్లు చెప్పడంద్వారా జగన్‌ అబద్దమాడాడో, నిజంచెప్పాడో ఆయనే ప్రజలకు స్పష్టం చేయాలన్నారు.

(వైసీపీ ప్లీనరీలో జగన్‌ మాట్లాడిన వీడియోను విలేకరుల ఎదుట ప్రదర్శించారు)  పీఎంకిసాన్‌సమ్మాన్‌యోజన పథకం ప్రారంభమైంది ఫిబ్రవరి 24, 2019న అయితే, జగన్‌ ప్లీనరీలో చెప్పింది జూలై09, 2017న అని, ఆనాడు ఏపథకంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతిరైతు కుటుంబానికి చెప్పిన వైసీపీ అధినేత, నేడు ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం ఇస్తున్నదానికి కలిపి భరోసా అమలుచేస్తామనడం ద్వారా మాటతప్పారో, మడమతిప్పారో ఆయనే స్పష్టంచేయాలన్నారు.

రైతుభరోసా ప్రారంభం సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఈరోజుకి (15-10-2019) పథకానికి అర్హులుగా భావిస్తున్నవారి సంఖ్య కేవలం 51లక్షలమందేనని, వారిలో కౌలురైతులు 3లక్షలేనని చెప్పడంద్వారా జగన్మోహన్‌రెడ్డి మరోసారి అబద్ధమాడారని, ఈవిషయం ఆయన ప్రభుత్వమిచ్చిన పత్రికాప్రకటనల్లోనే ఉందని నరేంద్ర స్పష్టం చేశారు.

తాను అబద్ధాలాడి ఉంటే, 2014లోనే ముఖ్యమంత్రినయ్యేవాడినని గతంలో అనేకసార్లు చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఈనాడు అబద్ధాల పునాదులమీదనే పరిపాలన సాగిస్తున్నాడనటంలో ఎటువంటి సందేహంలేదని ధూళిపాళ్ల చెప్పారు. రైతులసంఖ్యను నిర్ధారించడంలో కూడా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రవ్యవసాయమంత్రి, ఆర్థికమంత్రిబుగ్గనలు పొంతనలేని లెక్కలుచెప్పారన్నారు.

వైసీపీ ప్రభుత్వం రాగానే నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో  సోషియో ఎకనమిక్‌సర్వే ప్రకారం రాష్ట్రంలో రైతుభరోసా కింద 53లక్షల48వేల మంది రైతులకు, 15లక్షల35వేల600 మంది కౌలురైతులకు, ఏటా 12,500 ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు.

దేశంలోనే అపరమేథావి అయిన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థికమంత్రిగా తాను తొలిసారిఅసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాట్లాడుతూ, మేనిఫెస్టో లో చెప్పినట్లుగా రైతు భరోసా పథకం కింద ఏటా మే నెల్లోనే, రూ.12,500 చొప్పున, 64లక్షల6వేలమంది రైతులకు, 15.36లక్షలమంది కౌలురైతులకు లబ్ధిచేకూరుస్తామని చెప్పిన విషయాన్ని నరేంద్ర పునరుద్ఘాటించారు.

అసెంబ్లీలో బుగ్గన చెప్పినట్లుగా 64లక్షలమంది రైతులు, 15లక్షలమంది కౌలురైతులు ఉండాల్సి ఉంటే, నేడు ప్రభుత్వం పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఆ సంఖ్య 51లక్షలు, కౌలురైతులు 3లక్షలు ఎలాఅయ్యారో  ఆ లెక్కల్లోని మాయాజాలమేమిటో బుగ్గనే చెప్పాలని నరేంద్ర ఎద్దేవాచేశారు.

రైతుభరోసా  పథకానికి సంబంధించి ప్రభుత్వమిచ్చిన జీవోనెం-96లోనే రైతులను కులాలవారీగా విభజించారని, ఆ విషయం వ్యవసాయమంత్రి కన్నబాబు తెలుసుకోవాలని టీడీపీనేత సూచించారు. జీవో-96లో కౌలురైతుల్లో ఓసీలు లేరనే నిబంధన చేర్చారని, కౌలురైతుల్లో ఓసీలు ఏంపాపం చేశారో మంత్రి సమాధానం చెప్పాలని నరేంద్ర డిమాండ్‌చేశారు.

రైతు అనే ప్రతిఒక్కరికీ సహాయం చేస్తామని సోషియోఎకనమిక్‌ సర్వేలో, బడ్జెట్‌ ప్రసంగం లో, జీవోల్లో చెప్పిన ప్రభుత్వం, మంత్రులే నేడు పత్రికలకు ఇచ్చిన పూర్తిపేజీ ప్రకటనల్లో మాత్రం అర్హులసంఖ్యను 51లక్షలేనని చెప్పడంద్వారా అడ్డగోలుగా రైతుల్ని ఎలా మోసగిం చారో అర్థమవుతోందన్నారు.

రైతుభరోసా మొత్తాన్ని ఒకేసారి ఇస్తామనిచెప్పిన వారే, ఇప్పుడు విడతలవారీగా 12,500లకు బదులు రూ.7వేలే ఇస్తున్నారని తద్వారా ,రాష్ట్ర రైతాంగానికి రూ.10వేల కోట్లవరకు నష్టం కలిగించారని ధూళిపాళ్ల వివరించారు.       నేడు హ్యాండ్స్‌వాష్‌డే అని, ఆ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినహమీలన్నిం టినీ డెటాల్‌వేసి కడిగేసుకుంటోందని నరేంద్ర దెప్పిపొడిచారు.

ప్రతిపక్షంలో ఒకటిచెప్పి, అధికారంలోకి వచ్చి 6నెలలు కాకుండానే హామీలను కడిగిపారేస్తూ, రైతులు సహా అన్నివర్గాల వారికి తీవ్ర అన్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమేనన్నారు.