విశాఖ, విజయవాడలో 144 సెక్షన్ : అర్ధరాత్రి నుంచి ప్రతిపక్ష నేతల అరెస్ట్
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర యువత నేటి నుంచి కొనసాగించనున్న మౌన దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 144 సెక్షన్ ప్రకటించారు. ఐదుగురు మించి కనిపిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఎంపీ
ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర యువత నేటి నుంచి కొనసాగించనున్న మౌన దీక్షపై పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 144 సెక్షన్ ప్రకటించారు. ఐదుగురు మించి కనిపిస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, తదితర నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. ప్రత్యేక హోదా మౌన దీక్షలకు కేంద్రంగా భావిస్తున్న విశాఖపట్నం ఆర్కె బీచ్‌లో ప్రవేశాన్ని నిషేధించారు. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం ఆరుగంటల వరకు ఆర్కే బీచ్‌లో ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి నుంచి ముందస్తు అరెస్టులు సాగిస్తున్నారు రాష్ట్రమంతటా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెడుతున్నారు.
విశాఖపట్నం ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం సిటీ పోలీసులు బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకున్నారు. ప్రతి పోలీస్ తమ స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీసి పంపాలని, వాటి ద్వారా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని సిటీ పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
నగరంలో 144 సెక్షన్ విధించారు. బుధవారం సాయంత్రం 5గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకూ 36 గంటల పాటు నగరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జాయింట్ పోలీస్ కమిషనర్ ఏఎస్ ఖాన్, లా అండ్ ఆర్డర్ డీసీపీ నవీవ్ గులాటీ ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, ప్రదర్శనలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించకూడదని, కాదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా ఆర్కే బీచ్‌లోకి ఎవరినీ అనుమతించబోమని విశాఖ పోలీసు కమిషనర్ బుధవారం రాత్రి హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనల నేప్యథ్యంలో బీచ్ రోడ్లో మార్నింగ్ వాక్‌లను కూడా పోలీసులు అనుమతించకపోవడంతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.