శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (17:44 IST)

శ్రీకాళహస్తిలో మేకపిల్లను మింగిన కొండచిలువ.. చివరికి..?

పలు సందర్భాల్లో కొండ చిలువలు మనుషులను మింగేసిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఓ కొండ చిలవ మేక పిల్లను మింగిన ఘటన చోటుచేసుకుంది.

శ్రీ కాళహస్తీశ్వరాలయం సమీపంలోని భరద్వాజ తీర్ధంలో 13 అడుగుల కొండచిలువ ఓ మేకపిల్లను మింగేసింది. దీంతో కొండ చిలువ అటు ,ఇటు ముందుకు కదలలేని స్ధితిలో అక్కడే ఉండటంతో దీనిని ఆలయ సిబ్బంది గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
 
హుటాహుటిన అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను పట్టుకుని మింగిన మేకపిల్లను కక్కించారు. మేక పిల్లను బయటకు తీసేందుకు కొండచిలువ చాలా సేపు ఉక్కిరిబిక్కిరైంది.

కొండచిలువ మేకపిల్లను మింగిన విషయం తెలియటంతో స్ధానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొండ చిలువ మింగిన మేకను బయటకు కక్కుతున్న దృశ్యాలను వారంతా వింతగా చూశారు.
 
కొండ చిలువ కడుపులో నుండి బయటకు వచ్చిన మేకపిల్ల అప్పటికే చనిపోయింది. అటవీ సిబ్బంది కొండ చిలువను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టారు. అయితే కొండచిలువ మేకను మింగిన ఘటన ఆప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.