బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (07:25 IST)

టిటిడి వెబ్‌సైట్‌, అమేజాన్‌లో 2021 టిటిడి డైరీలు, క్యాలెండ‌ర్ల‌ బుకింగ్ స‌దుపాయం

టిటిడి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 2021వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టిటిడి వెబ్‌సైట్‌తోపాటు అమేజాన్ ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌లోనూ బుక్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించ‌డ‌మైన‌ది. 

టిటిడికి చెందిన tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ''పబ్లికేషన్స్‌''ను క్లిక్‌ చేసి డెబిట్‌కార్డు లేదా క్రెడిట్‌ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి త‌పాలా శాఖ ద్వారా వారి చిరునామాకు పంపుతారు. భ‌క్తులు ఎన్ని క్యాలెండ‌ర్లు, డైరీల‌నైనా బుక్ చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్‌, షిప్పింగ్ ఛార్జీలు అద‌నం.
 
విదేశాల్లోని భక్తులకు సైతం..
ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే విదేశాల్లోని భక్తులకు త‌పాలా శాఖ ద్వారా డైరీలు, క్యాలెండర్లను అందించేలా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. త‌పాలా శాఖ నిర్దేశిత ఛార్జీల‌ను వ‌సూలుచేసి నిర్ణీత స‌మ‌యంలో బ‌ట్వాడా చేస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు బ‌ట్వాడా స‌మాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియ‌జేస్తున్నారు.
 
డిడి తీసి పంపితే చాలు ...
టిటిడి క్యాలెండర్‌, డైరీలను పోస్టు ద్వారానూ భక్తులు పొందవచ్చు. ఇందుకోసం ''కార్యనిర్వహణాధికారి, టిటిడి, తిరుపతి'' పేరిట ఏదైనా జాతీయ బ్యాంకులో డిడి తీసి కవరింగ్‌ లెటర్‌తో కలిపి ''ప్రత్యేకాధికారి, పుస్తక ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్‌ కాంపౌండ్‌, కెటి.రోడ్‌, తిరుపతి'' అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

టు పే విధానం(పోస్టల్‌ చార్జీలు అదనం) ద్వారా భక్తులకు టిటిడి క్యాలెండర్‌, డైరీలను పంపడం జరుగుతుంది. డైరీ, క్యాలెండ‌ర్ల కొనుగోలుకు సంబంధించిన స‌మాచారం కోసం 0877-2264209 నంబ‌రు ద్వారా ప్ర‌చుర‌ణ‌ల విభాగం కార్యాల‌యాన్ని గానీ, 9963955585 నంబ‌రు ద్వారా ప్ర‌త్యేకాధికారిని గానీ సంప్ర‌దించ‌గ‌ల‌రు.
 
డైరీలు, క్యాలెండ‌ర్ల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 12 పేజీల క్యాలెండర్‌ రూ.100/-, పెద్ద డైరీ రూ.130/-, చిన్నడైరీ రూ.100/-, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్ రూ.60/-, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.15/-, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ - రూ.15/-, శ్రీవారు మరియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండ‌ర్ రూ.10/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.20/-. తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి.

అదేవిధంగా, విజయవాడ, వైజాగ్‌, హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబయిలోని టిటిడి సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టిటిడి భక్తులకు అందుబాటులో ఉంచింది. వీటితోపాటు టిటిడికి అనుబంధంగా ఉన్న అన్ని ఆల‌యాల్లో భ‌క్తుల‌కు కోసం సిద్ధంగా ఉంచారు.