ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
అన్ని రకాల వనరులు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా సహజ వనరులు, సారవంతమైన భూమి, నదులు - నీటి పారుదల వ్యవస్థలతో వ్యవసాయ అనుకూలమైన వాతావరణం ఉండటం శుభ పరిణామమని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దేశంలో రెండవ పొడవైన తీరప్రాంతాన్ని కలిగి, అతిపెద్ద సముద్ర ఉత్పత్తిదారులలో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్, తగినన్ని మానవ వనరులను సైతం కలిగి ఉందన్నారు.
ప్రగతిశీల వైఖరి, స్నేహ పూర్వక వ్యాపార విధానాలతో పాటు బలమైన భౌతిక, సామాజిక, పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు ఆంధ్ర ప్రదేశ్ కు వరమన్నారు. హరిచందన్ మాట్లాడుతూ భవిష్యత్తులో భారతదేశంలోని ఉత్తమ రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ అవతరించగలదన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వ్యవసాయ వినియోగానికి తగినంత నీటి సరఫరాను అందిస్తూ, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయటం ముదావహం అన్నారు. అంగన్వాడీ కేంద్రాల మొదలు ఉన్నత విద్యా సంస్థల వరకు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రత్యేక వైద్య సేవల విషయంలోనూ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఎంచదగినవన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రత్యేకంగా ప్రస్తావించిన గవర్నర్ , ఇది దేశంలోనే మొట్టమొదటిదన్నారు. అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట, ప్రజల ఇంటి ముంగిట కు తీసుకెళ్లడానికి ఈ వ్యవస్థ వీలు కల్పించిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధితో పాటు వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గృహనిర్మాణం, సంక్షేమం వంటి తొమ్మిది ప్రధాన రంగాల సంక్షేమ పథకాలతో కూడిన నవరత్నాల కార్యక్రమం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మేలు చేకూరుతుందని వివరించారు.
వృద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ కలిగి ఉందని, అభివృద్ధి దిశలో రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని తాను కోరుకుంటున్నానని హరిచందన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.