శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 28 అక్టోబరు 2020 (07:53 IST)

నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని నవంబరు ఒకటో తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్ణయించలేదు.

తొలుత భాషాప్రయుక్త రాష్ట్రాలలో భాగంగా 1953లో అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణతో కూడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1న నిర్వహించేవారు. అనంతరం 2014 జూన్‌ 2న రాష్ట్ర విభజన జరిగింది. ఆ రోజును అపాయింటెడ్‌ డేగా ప్రకటించారు.

దీంతో గత ప్రభుత్వంలో ప్రతియేటా జూన్‌ 2న నవనిర్మాణ దీక్ష ప్రారంభించి, 8వ తేదీన మహాసంకల్ప దీక్ష చేసేవారు. తాజాగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించి.. దాన్ని రాష్ట్ర రాజధానిలోనూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించాలని ఆదేశాలిస్తూ మంగళవారం జీవో విడుదల చేసింది.

ఈ వేడుకను నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ను, సభ్యులుగా యువజనాభివృద్ధి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్‌, గుంటూరు అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు, ఏపీటీడీసీ ఎండీ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌, యువజన సర్వీసుల శాఖ డైరెక్టర్‌లను, కన్వీనర్‌గా ప్రోటోకాల్‌ విభాగం డిప్యూటీ కార్యదర్శిని నియమించింది.