తమ్ముడితో కలిసి భార్యను రేప్ చేసిన భర్త
మూడుముళ్ళు వేసి ఏడు అడుగులు వేసిన తరువాత భార్యతో కలిసి వందేళ్ళు నడవడం భర్త బాధ్యత. అందుకే సాంప్రదాయాల ప్రకారం వివాహం చేస్తుంటారు. కానీ అలాంటి భర్త తన భార్య పట్ల అత్యంత హీనంగా ప్రవర్తించాడు. సభ్యసమాజం తలదించుకునేలా తన తమ్ముడితో కలిసి పూటుగా మద్యం సేవించి భార్యను అత్యాచారం చేశాడు. తమ్ముడిని అత్యాచారం చేయమని పురిగొల్పాడు. భర్త ప్రవర్తనతో నిశ్చేష్టురాలైన అభాగ్యురాలు ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని సోమేష్ నగర్‌కు చెందిన మల్లేష్ రాణికి రెండు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. గత మూడు నెలల నుంచి భార్యాభర్తల మద్య మనస్పర్థలు ఉండేవి. దీంతో తన భర్తతో సరిగ్గా మాట్లాడేది కాదు రాణి. ఆ ఇంట్లో తమ్ముడు కుమార్ కూడా ఉండేవాడు.
భార్య తనకు దూరంగా ఉండటాన్ని సహించలేకపోయాడు మల్లేష్. తమ్ముడు కుమార్‌తో కలిసి పూటుగా మద్యం సేవించిన మల్లేష్ ఇంటికి వచ్చాడు. నిద్రిస్తున్న భార్యను తాళ్ళతో రెండు చేతులు కట్టేశాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలాగే తమ్ముడు కుమార్‌ను అత్యాచారం చేయమని పురిగొల్పాడు. పెనుగులాటలో రాణికి తీవ్ర రక్తస్రావమైంది. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది రాణి. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మద్య కొట్టుమిట్టాడుతోంది రాణి.