రామకృష్ణ అలియాస్ ఆర్కే మృతిపై అధికారిక ప్రకటన, అతడి చరిత్ర ఏంటి?
దక్షిణ బస్తర్ అడవుల్లోని మాడ్ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు అధికారికంగా దృవీకరించారు. దేశ వ్యాప్తంగా ఆర్కేపై పలు కేసులున్నాయి. అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి కేసులో నిందితుడిగా ఉన్నారు. బలిమెల ఎన్‌కౌంటర్ నుంచి ఆర్కే తృటిలో తప్పించుకోగా, ఈ ఘటనలో ఆయనకు బుల్లెట్ గాయమైంది. 2004 అక్టోబరు 15న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్కే నేతృత్వంలోనే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆర్కేపై రూ.50 లక్షల రివార్డును పోలీసుశాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలుమార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. మావోయిస్టు ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. శిరీష అలియాస్ పద్మను ఉద్యమ సమయంలోనే ఆర్కే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె సొంత గ్రామం ప్రకాశం జిల్లాలో నివాసముంటున్నారు. ఆర్కే కుమారుడు పృథ్వీ రెండేళ్ల క్రితం పోలీసుల ఎదురు కాల్పుల్లో మృతి చెందారు. ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో మారుమూల కుగ్రామం తుమృకోట బడి పంతులు కుమారుడు మావోయిస్టు ఉద్యమ రథసారథిగా ఎదిగాడు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. అతనే అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే. హరగోపాల్ తండ్రి అక్కిరాజు సచ్చిదానందరావు స్వగ్రామం గుత్తికొండ.
బీఏ, బీఈడీ చదువుకున్న సచ్చిదానందరావు మాస్టారు పెద్ద కొడుకైన హరగోపాల్‌కు తండ్రి నుంచి అభివృద్దికోసం ఆరాటం, అవినీతిపై అసహ్యం, పేదల ప్రగతికి పాటుపడాలన్న తపన అలవడ్డాయి. ఉన్నత పాఠశాల భవనం అద్దె చెల్లించేందుకు హెచ్.ఎం. ఆదేశాల మేరకు మిగిలిన విద్యార్థులతో కలిసి పత్తి, మిరప కోతలకు వెళ్లేవాడు. తల్లి సత్యవతి చొరవ చూపి బంగ్లాదేశ్ వరద బాధితులకు విరాళాలు పోగుజేసి పంపడంలో కూడా కుమారునిలో ఆదర్శభావాల పెంపునకు దోహదపడింది.
మాచర్ల ఎస్‌కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివేటప్పుడు రామకృష్ణ రాడికల్ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. గ్రామంలో సింగరుట్ల పంతులు చెప్పే నక్సల్బరీ ఉద్యమ గాధలు, చారుమజుందార్, కానూ సన్యాల్ చరిత్ర, శ్రీకాకుళం పోరాటంపై ఆసక్తి కనబర్చేవాడు. మాచర్లలో ఉన్నప్పుడే హరగోపాల్‌పై పార్టీ హోల్ టైమర్ బాలయ్య ప్రభావం అధికంగా పడింది. సహచరులు కోలా రమణారెడ్డి, చంద్రశేఖర్, సింగరుట్ల పంతులు సాహచర్యం అతడిని ఉద్యమంలో స్థిరపడేలా చేశాయి. అప్పట్లో మాచర్లలోని కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ కళాశాల రాడికల్ ఉద్యమానికి కేంద్ర స్థావరం అయింది. ప్రముఖ ఆర్టిస్టు, గాయకుడు అయిన పార్టీ హోల్ టైమర్ బాలయ్య వందలాది మంది విద్యార్థులను ఉద్యమం వైపు ఆకర్షింపజేశాడు.
మాచర్ల మండలం ఏకోనాంపేట వద్ద కృష్ణానది ఒడ్డున జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి రామకృష్ణ తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన గురించి పల్నాడు ప్రజలు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. పార్టీ ప్రచారంలో భాగంగా రామకృష్ణ దళంతో కలిసి స్వగ్రామం తుమృకోట సందర్శించారు. ఈ సమాచారాన్ని ఇన్ఫార్మర్ మస్తాన్ వలీ అప్పటి జిల్లా ఎస్పీ మీనాకు చేరవేశాడు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అప్రమత్తమైన పోలీసు బలగాలు ఎస్పీ ఆధ్వర్యంలో ఎన్‌కౌంటర్‌కు రంగం సిద్ధం చేశాయి. అప్పటికే దళం తుమృకోట నుంచి ఏకోనాంపేటకు చేరింది. కృష్ణానది రెండో పాయ వద్ద ఇరువైపులా మోహరించిన పోలీసులు, నక్సల్స్ మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. హరగోపాల్ వెంట్రుకవాసిలో తప్పించుకోగా, దళ సభ్యుడైన మరో రామకృష్ణ, హోల్‌టైమర్ వెంకటేశ్వర్లుతో సహా ముగ్గురు మత్స్యకారులు మృతి చెందారు.