మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (09:06 IST)

బీజాపూర్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ మృతి

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ (ఆర్కే) మృతి చెందారు. బీజాపూర్ అడవుల్లో ఆయన చనిపోయారు. అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆర్కే చనిపోయినట్టు బస్తర్ పోలీసులు తెలిపారు. ఆయన అసలు పేరు అక్కిరాజు హరగోపాల్. విప్లవోద్యమంలో ఆయనది తిరుగులేని పాత్ర. నేపాల్ నుంచి దక్షిణ భారతం వరకు ఆయనకు గొప్ప విప్లవ నేతగా గుర్తింపు ఉంది.
 
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపిన మావోయిస్టు బృందానికి ఆయన నాయకత్వం వహించారు. రామకృష్ణపై రూ.20 లక్షల రివార్డు ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై దాడి కేసులో కూడా ఆర్కే పేరును కూడా పోలీసులు ఓ నిందితుడిగా చేర్చారు. 
 
అనేక ఎన్‌కౌంటర్ల నుంచి తన ప్రాణాలను తప్పించుకున్న ఆర్కే... నాలుగేళ్ల క్రితం బలిమెలలో జరిగిన ఎన్‌‍కౌంటర్‌లో బుల్లెట్ గాయమయింది. అదే ఎన్‌కౌంటర్‌లో ఆయన కుమారుడు మృతి చెందాడు. బుల్లెట్ గాయమైనప్పటి నుంచి ఆర్కే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మరోవైపు ఆర్కే మృతిపై విరసం, తోడల్లుడు నేత జి.కల్యాణరావు స్పందించారు. 
 
ఆర్కే మృతి విషయమై ఆ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని, టీవీల్లో చూసి తెలుసుకున్నామన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆర్కేకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు.
 
కాగా, ఆర్కే భార్య శిరీష మూడు నెలల క్రితం ఆయనను కలిసినట్టు సమాచారం. తల్లిదండ్రులు, సోదరులంటే ఆర్కేకు ఎంతో ఇష్టం. ఉద్యమం కోసం అడవులకు వెళ్లినా, వారిని చూసేందుకు రహస్యంగా మూడుసార్లు హైదరాబాద్ వచ్చినట్టు ఆయన సోదరుడు రాధేశ్యాం తెలిపారు.
 
ప్రభుత్వాలు అవకాశమిస్తే ఆర్కే మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కాగా, ఆర్కే మృతిపై తమకు ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం ఏదీ లేదని ప్రొఫెసర్ హరగోపాల్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.