దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్- 18వేల ఎగువన?
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి. వరుస లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లలో నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ తొలిసారిగా 18వేల ఎగువన ముగిసింది. ఆటో, పవర్, మౌలిక రంగాల షేర్లు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోవడంతో 169.80 పాయింట్లు లేదా 0.94 శాతం బలపడి మునుపెన్నడూ లేనివిధంగా 18,161.75 వద్ద స్థిరపడింది.
ఒకానొక దశలో 18,197.80 స్థాయిని తాకి నయా ఇంట్రా-డే రికార్డునూ నిఫ్టీ నెలకొల్పింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ సైతం 452.74 పాయింట్లు లేదా 0.75 శాతం ఎగిసి ఆల్‌టైమ్ హై 60,737.05 వద్ద నిలిచింది. ఇంట్రా-డేలోనూ 60,836.63 స్థాయికి ఎగబాకి నూతన రికార్డును సృష్టించింది. మహీంద్రా అండ్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఐటీసీ తదితర షేర్ల విలువ 5 శాతానికిపైగా పెరిగాయి.
స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజులు లాభాల్లోనే ముగియడంతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ.2,70, 73,296. 03 కోట్లకు చేరింది. బుధవారం ఒక్కరోజే రూ.2,42,908.24 కోట్లు ఎగిసింది. మొత్తం ఈ ఐదు రోజుల్లో రూ.8,52, 748.98 కోట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 1,547.32 పాయింట్లు పెరిగింది. మదుపరులకు టాటా మోటర్స్ షేర్లు కాసుల వర్షం కురిపించాయి.