ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 డిశెంబరు 2024 (10:08 IST)

నేడు అమరావతి రైతులకు లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు

amaravati capital
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే) పరిధిలో నివాస ప్లాట్లను కేటాయించేందుకు వీలుగా గురువారం లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఈ లాటరీలో పేర్లు వచ్చే రైతులకు సీఆర్డీయే ప్లాట్లను కేటాయించనుంది. 
 
ముఖ్యంగా సీఆర్డీయే పరిధిలో భూ సమీకరణ పథకంలో భూములను అప్పగించిన రైతులకు ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్ల కోసం గురువారం ఈ-లాటరీని నిర్వహిస్తున్నారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీయే కార్యాలయంలోని సమావేశ మందిరంలో దీనిని నిర్వహిస్తారు. 
 
అమరావతి పరిధిలో 14 గ్రామాలలో రైతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ర్యాండమ్ సిస్టమ్ ద్వారా ప్రత్యామ్నాయ రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తారు. ఈ మేరకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. 
 
నవులూరు, కురగల్లు, నిడమర్రు, రాయపూడి, లింగయపాళెం, మల్కాపురం, నెక్కల్లు, శాఖమూరు, తుళ్ళూరు, వెలగపూడి, మందడం, అనంతవరం, ఐనవోలు తదితర గ్రామాలకు చెందిన రైతులు ఈ లాటరీకి హాజరుకావాలని కమిషనర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.