గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (16:31 IST)

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

amaravati capital
వచ్చే యేడాది జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి పి.నారాయణ తెలిపారు. అదేసమయంలో డిసెంబరు నెలాఖరు నాటికి 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లను పిలిచే ప్రక్రియ పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. 
 
రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై వేసిన సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్రతో పాటు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేశ్, సంధ్యారాణి జూమ్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ తర్వాత మంత్రి నారాయణ విలేకరులతో మాట్లాడారు. 
 
రాజధానిలో ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల కోసం 20 ఎకరాల కేటాయింపుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్‌కు 5 ఎకరాలు, ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీకి 0.8 ఎకరాలు, బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌కు 15 ఎకరాలు, ఎల్ అండ్ టీ స్కిల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
 
బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు, టీటీడీకి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉప సంఘం అంగీకారం తెలిపిందన్నారు. 131 మందికి గతంలో భూములు ఇచ్చామని, వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని తెలిపారు. గతంలో భూములు ఇచ్చిన వారికి అప్పటి ధరలకే ఇస్తున్నామని చెప్పారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. వచ్చే నెలాఖరులోగా భూ కేటాయింపులు పూర్తవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.