శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Updated : శుక్రవారం, 23 జూన్ 2017 (21:19 IST)

అమరావతి ప్రకటన సిద్ధం... ఏంటది?

అమరావతి : మహిళా సాధికారితకు సంబంధించిన అమరావతి ప్రకటన (డిక్లరేషన్) సిద్ధమైందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని సమావేశ హాలులో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమ

అమరావతి : మహిళా సాధికారితకు సంబంధించిన అమరావతి ప్రకటన (డిక్లరేషన్) సిద్ధమైందని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని సమావేశ హాలులో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడకు సమీపంలోని పవిత్రసంగమం వద్ద ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు మూడు రోజులపాటు జరిగిన జాతీయ మహిళాపార్లమెంట్‌లో పాల్గొన్న రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళలు, యువతులు, విద్యార్థుల అనుభవాల సారంతో జరిగిన ఉపన్యాసాలు, చర్చలు, సిఫారసులు, తీర్మానాలకు సంక్షిప్త రూపమే ఈ ప్రకటన అని వివరించారు. 
 
మహిళా పార్లమెంట్‌లో అమెరికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ మహిళలతోపాటు దాదాపు 25 వేల మంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన, సిఫారసు చేసిన అంశాలకు సంక్షిప్త రూపం ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు దీనిని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు. 8 మంది ఎడిటోరియల్ బోర్డు సభ్యులతో పది అంశాలతో కూడిన ఒక ముసాయిదాని తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో స్త్రీ విద్య, మహిళల న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం, సమతుల ఆహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, పరిశోధన, నూతన ఆవిష్కరణల్లో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళల సమాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర, మహిళల సామాజికాభివృద్ధి, మహిళల డిజిటల్ విద్య అనే అంశాలు ఉన్నట్లు వివరించారు. 
 
ముసాయిదాను  రూపొందించడంలో రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా ఎంతో కృషి చేసినట్లు ప్రశంసించారు. ఈ రోజు 8 మంది ప్రముఖ మహిళలు ఈ ముసాయిదాను అంశాలవారీగా మూడు గంటల పాటు పరిశీలించి, చర్చించి, మార్పులు చేర్పులు చేసి తుది రూపం ఇచ్చారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో వివాదాలకు తావులేకుండా విస్తృత అంశాల ప్రాతిపదికన ఈ ప్రకటనను తయారు చేసిటన్లు చెప్పారు. తుది ప్రకటన ముద్రణ పూర్తి అయిన తరువాత దీనిని రూపొందించడంలో కృషి చేసిన మహిళల సమక్షంలో త్వరలో ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని స్పీకర్ చెప్పారు. 
 
అంతకుముందు సుమిత దావ్రా మాట్లాడుతూ మహిళా పార్లమెంటులో దాదాపు 12 వేల మంది విద్యార్థినులు పాల్గొన్నట్లు చెప్పారు. 14 మంది ప్రముఖ మహిళల ప్రసంగాలతోపాటు విద్యార్థినులు ప్రసంగాల్లో ముఖ్యమైన వాటితో ఓ పుస్తకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు సూచనలు, సలహాలు అమరావతి ప్రకటనలో ఉంటాయని చెప్పారు. ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ మాట్లాడుతూ ఈ ప్రకటన రూపకల్పనలో తనను కూడా భాగస్వామిని చేయడం గొప్ప భాగ్యంగా భావించారు. మహిళలు, విద్యార్థుల స్వీయ అనుభవాల సారాంశం, సిఫారసులతో ఈ ప్రకటన రూపొందించడం గొప్ప చర్యగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త కూడా పాల్గొన్నారు.
 
అంశాలవారీగా విస్తృత స్థాయిలో చర్చలు
మహిళా సాధికారిత కోసం రూపొందించిన అమరావతి ప్రకటనకు  తుది రూపం ఇచ్చారు.  స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం స్పీకర్ చాంబర్ లో సమావేశమైన  పది మంది సభ్యులు ప్రకటన ముసాయిదాలోని పది అంశాలపై  విస్తృత స్థాయిలో చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రతి అంశంలోని విషయాలను ఆమూలాగ్రం చర్చించారు. మహిళలు, విద్యార్థినులు, బాలికలు, పిల్లలకు సంబంధించి చిన్న చిన్న అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. గ్రామీణ స్థాయి పేద మహిళలు మొదలుకొని  పట్టణ స్థాయి పేద మహిళలు, అసంఘటిత కార్మిక మహిళలు, ఒంటరి మహిళలు, గర్భినీ స్త్రీలు, పసిపిల్లల స్థితిగతులపై ప్రతి అంశాన్ని చర్చించారు. 
 
పాఠశాల స్థాయిలో విద్యార్థినులకు సౌకర్యాలు, ఉపాధిపై అవగాహన, స్వీయరక్షణ, మహిళల న్యాయపరమైన హక్కులు, వ్యభిచార కూపంలోకి నెట్టబడే బాలికలు, మహిళల సమస్యలు, మహిళలకు వృత్తి విద్య, గ్రామీణ పరిశ్రమలు, డ్రైవింగ్ లో శిక్షణ, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణ సౌకర్యం కల్పించడం, పన్నుల మినహాయింపు, ప్రత్యేక మహిళా పారిశ్రామిక జోన్ల ఏర్పాటు, సైబర్ సెక్యూరిటీ, సినిమా, టీవీ, మీడియా నుంచి రక్షణ, అన్ని రంగాల్లో సమాన అవకాశాలు తదితర అనేక అంశాలను చర్చించి తగిన సూచనలు, సలహాలతో ముసాయిదాలో మార్పులు చేర్పులు చేసి తుది రూపం ఇచ్చారు. ఈ సమావేశంలో జస్టిస్ జీ.రోహిణి, అమరావతి డెవలప్ మెంట్ కార్పోరేషన్ (ఏడీసీ) చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధ, ఎండోమెంట్స్ కమిషనర్ అనురాధ, పాఠశాల విద్య కమిషనర్ సంధ్యారాణి, ప్లానింగ్ శాఖ సెక్రటరీ సంజయ్ గుప్త, పద్మావతి మహిళా విశ్వవిద్యలయం ప్రొఫెసర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.