శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 8 ఆగస్టు 2017 (22:44 IST)

త్వరలో అమరావతి డిక్లరేషన్ విడుదల... స్పీకర్ కోడెల శివప్రసాద రావు

అమరావతి : వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు, విద్యార్థినుల అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో అమరావతి ముసాయిదా డిక్లరేషన్‌లో మార్పులుచేర్పులు చేశామని, త్వరలో దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు

అమరావతి : వివిధ రంగాలకు చెందిన ప్రముఖ మహిళలు, విద్యార్థినుల అమూల్యమైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో అమరావతి ముసాయిదా డిక్లరేషన్‌లో మార్పులుచేర్పులు చేశామని, త్వరలో దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరిస్తారని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం అమరావతి డిక్లరేషన్ పైన కీలక సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడకు సమీపంలోని పవిత్రసంగమం వద్ద ఫిబ్రవరిలో మూడు రోజులపాటు జాతీయ మహిళా పార్లమెంట్ జరిగిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ ప్రకటన రూపొందిస్తున్నట్లు తెలిపారు. 
 
క్షేత్రస్థాయిలో సలహాలు, సూచనలు స్వీకరించి, ఇప్పటివరకు మూడుసార్లు సమావేశాలు నిర్వహించి, మహిళా సమస్యలను విస్తృత స్థాయిలో చర్చించి, డిక్లరేషన్ లో మార్పులు, చేర్పులు చేసి తుది రూపం ఇచ్చినట్లు తెలిపారు. అన్ని విధాల మహిళలకు సహాయపడేవిధంగా దీనిని రూపొందిస్తున్నట్లు చెప్పారు. పది అంశాలతో అర్థవంతమైన రీతిలో, అందరికీ ఉపయోగపడేవిధంగా ఒక బెంచ్ మార్క్‌గా దీనిని తయారు చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు.
 
అమరావతి డిక్లరేషన్‌కు తుది రూపం
శాసనసభ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అమరావతి డిక్లరేషనుకు తుది రూపం ఇచ్చారు. ప్రభుత్వంలోని ముఖ్య మహిళా అధికారులతోపాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థినులు పాల్గొని పలు అంశాలను చర్చించారు. డిక్లరేషన్ లోని స్త్రీ విద్య, మహిళల న్యాయపరమైన హక్కులు, మహిళల ఆరోగ్యం - సమతుల ఆహారం, పారిశ్రామిక రంగంలో మహిళలు, పరిశోధన - నూతన ఆవిష్కరణల్లో మహిళలు, రాజకీయాల్లో మహిళలు, మహిళల సమాజిక భద్రత, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో మహిళల పాత్ర, మహిళల సామాజికాభివృద్ధి, మహిళలు - డిజిటల్ విద్య అనే పది అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురి సలహాలు, సూచనలతో కొన్ని అంశాలలో మార్పులు, చేర్పులు చేశారు.
 
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు అందరు అనుసరించే విధంగా, విద్యా,ఆరోగ్యం, ఆర్థిక పరంగా అన్ని విధాల మహిళలు శక్తివంతులుగా తయారయ్యేవిధంగా ఒక మార్గదర్శకంగా అమరావతి ప్రకటన ఉంటుందని తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు వచ్చి దీనిపై చర్చించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ కష్టాలు దిగమింగుకొని పాటుపడే తత్వం మహిళలకే ఉంటుందన్నారు. ఇంతమంది మహిళా ప్రముఖులు, విద్యార్థినులు ఈ సమావేశంలో పాల్గొని తమ సూచనలు, సలహాలు ఇవ్వడం మంచి పరిణామంగా ఆమె వర్ణించారు. 
 
అర్థవంతమైన చర్చ జరిగిందన్నారు. చట్టసభలలో 50 శాతం స్థానాలు పొందిననాడే మనం విజయం సాధించినట్లు భావించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులను మహిళా సర్పంచ్ లు, జడ్పీటీసీ సభ్యుల భర్తలు కాకుండా వారే చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలన్నారు. రక్షాబంధన్, ఫ్రెడ్ షిప్ డేలను పురస్కరించుకొని అందరూ కలసిమెలసి స్నేహపూర్వకంగా జీవించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. మహిళా సమస్యల పరిష్కార విషయంలో స్పీకర్ ముందుంటుంన్నందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 
 
ఈ సమావేశంలో ఏపీ శాసనసభ స్పెషల్ సెక్రటరీ పీపీకె రామాచార్యులు, రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమిత దావ్రా, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కార్యదర్శి కె. సునిత, పాఠశాల విద్య శాఖ కమిషనర్ సంధ్య రాణి, దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ. అనురాధ, ఏపీఎస్ పీడిఎస్ డైరెక్టర్ వి.ప్రతిమ, ప్లానింగ్ శాఖకు చెందిన అలెన్ జాన్, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డీఎం మమత, ప్రొఫెసర్ డీబీ కృష్ణ కుమారి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎల్.జయశ్రీ, లెక్చరర్లు డాక్టర్ ఏ.నాగజ్యోతి, కెవీ పద్మావతి, ఎస్.శాంతకుమారి, ఐ.సుగుణ, డి.రాజ్యలక్ష్మి, ఎంవీ షీలాదేవి, సీహెచ్ గీతాదేవి తదితరులు పాల్గొన్నారు.