సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (13:57 IST)

క‌రోనా స‌మ‌యంలో అంబానీ, అదానీల ఆస్తులే రెట్టింపు...

దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనపై సీపీఐ నేత రామకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో చర్చ లేకుండా ప్రభుత్వం బిల్లులు పాస్ చేసుకుంటోందని అన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విధానం పై‌ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు.

అయినప్పటికీ కేంద్ర మంత్రులు మాత్రం మోదీని తెగ కీర్తిస్తున్నారని మండపడ్డారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాయడమే మోదీ పాలన తీరని విమర్శించారు. కరోనా సమయంలో అంబానీ, అదానీలు  ఆస్తులు మాత్రమే రెట్టింపు అయ్యాయన్నారు. 2014ముందు అదానీ ఎవరని?... ఇప్పుడు టాప్ బిలియనర్ ఎలా అయ్యాడని ఆయన ప్రశ్నించారు. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.62 మాత్రమే ఉందని... ఇప్పుడు రూ.108కి చేరినా చలనం లేదన్నారు. ప్రతిపక్షంలో ధరలు పెరిగి పోతున్నాయని రోడ్డెక్కారన్నారు.

ఇంకా సిగ్గు లేకుండా అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్‌కు అమ్ముడు పోయిన  ప్రభుత్వం ఇది అని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్‌ను సకాలంలో అందించలేక చతికిల పడిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుల్లో ఉందని, మరి కేంద్రం కూడా అదే స్థాయిలో అప్పులు చేసిందన్నారు. రూ.47లక్షల కోట్ల అప్పు నుంచి, రూ.119లక్షల కోట్ల అప్పుకు తీసుకెళ్లారని రామ‌కృష్ణ అన్నారు. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని.. అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

34 శాతం ఉపాధి కల్పించే పరిశ్రమలు మూతపడినా స్పందించరని మండిపడ్డారు.  సాధారణ ప్రజలు జీవితాలను గాలికొదిలేసి.. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేశం భవిష్యత్తు కార్యాచరణ సిద్దం అవుతుందన్నారు. కలిసి వచ్చే పక్షాలతో ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు.

బీజేపీ చేయాల్సింది జన ఆశీర్వాద యాత్ర కాదు.. జన వంచన యాత్ర చేయాలని హితవుపలికారు. విభజన చట్టంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని, అన్నీ చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని దుయ్యబట్టారు. ఏపీ కోసం మాట్లాడే ఒక్క బీజేపీ నాయకుడు కూడా లేడా అని ప్రశ్నించారు. రాష్ట్ర బిజెపి నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. మోదీ ఏపీకి చేసినంత అన్యాయం.. దేశంలో ఎక్కడా చేయలేదన్నారు. ఇప్పుడు అయినా బిజెపి నేతలు నోళ్లు తెరిచి, వాస్తవాలు చెప్పాలని రామకృష్ణ అన్నారు.