శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 మే 2021 (09:15 IST)

వ్యాక్సిన్ తయారీ కంపెనీ అధినేతకు కులం ఆపాదించవచ్చా? సీపీఐ నారాయణ

కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని అభియోగాలు మోపి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడాన్ని సీపీఐ నారాయణ తీవ్రంగా ఖండించారు.  ఓ వ్యాక్సిన్ కంపెనీ అధినేత కులం గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారన్న విషయాన్ని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు. రఘురామ చేస్తే తప్పు అయినప్పుడు సీఎం జగన్ కూడా అలా వ్యాఖ్యానించడం తప్పేకదా ఆయన ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రఘురామ కృష్ణరాజు అరెస్ట్ వెనక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వారిద్దరి సహకారం లేకుండా రఘురామను అరెస్ట్ చేసే అవకాశమే లేదన్నారు. రఘురామ వ్యాఖ్యలను తాను సమర్థించడం లేదన్న నారాయణ.. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
 
అరెస్టులకు పై స్థాయిలోని బీజేపీ నేతలు అనుమతి ఇస్తున్నారని, రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు మాత్రం అరెస్టులను ఖండిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల తీరు వింతగా ఉందన్నారు. ఈటల రాజేందర్ పైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కక్ష సాధిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని, అలాంటి పరిస్థితే వస్తే కనుక ప్రజలే బుద్ధి చెబుతారని నారాయణ హెచ్చరించారు.