7 యేళ్ల వయసు కలిగిన భారత ప్రభుత్వం కనిపించడం లేదు...
దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతుంటే వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. కరోనా రోగులతో దేశంలోని ఆస్పత్రులన్ని ఫుల్ అయిపోయాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని నడిపించాల్సిన ప్రధానమంత్రి ఇపుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. ప్రస్తుతం దేశంలో ఈ దుర్భర పరిస్థితికి ప్రధాని మోడీతో పాటు.. ఆయన కుడిభుజమైన హోం మంత్రి అమిత్ షానే కారణమని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో మోడీ - షాలకు వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ, వారిద్దరి వైపు నుంచి ఎలాంటి చలనం లేదు.
ఈ క్రమంల ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ఔట్‌లుక్ తన కవర్ పేజీలో ముద్రించిన ఫోటో ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనమైంది. కొవిడ్ విలయంతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందుబాటులో లేక, ప్రాణాధార ఔషధాలూ కరువైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కవర్‌పేజీని ఇలా రూపకల్పన చేశారు. 'ఏడేళ్ల వయసు' కలిగిన 'భారత ప్రభుత్వం' కనిపించడం లేదని.. ఆచూకీ తెలిసిన వారు పౌరులకు తెలియజేయాలంటూ వ్యంగ్యంగా రూపొందించారు. ఈ కవర్‌పేజీ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది.