ప్రజావేదిక భవనాన్ని కూల్చేయండి... బాబు అక్రమ కట్టడం కడ్తారా? సీఎం జగన్ ఫైర్
గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక ఓ అక్రమ నిర్మాణమని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే, ఇక సామాన్య ప్రజలు ఎన్ని అక్రమ నిర్మాణాలు చేపడుతారంటూ అధికారులను ప్రశ్నించారు. అందుకే మనం కూర్చొన్న అక్రమ నిర్మాణమైన ప్రజా వేదికను ఎల్లుండి నుంచి (బుధవారం) కూల్చివేసే పనులు చేపడుతామని ఆయన ప్రకటించారు.
ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సు సీఎం అధ్యక్షతన జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ ప్రజా వేదిక భవనాన్ని గత టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. దీని నిర్మాణానికి నిబంధనలను తుంగలో తొక్కి నిర్మించారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టానికి విరుద్దంగా, అవినీతి సొమ్ముతో కట్టారు. ఓ ఇల్లీగల్ బిల్డింగ్‌లో ఇంతమంది అధికారులం ఇల్లీగల్ అని తెలిసీ సమావేశం జరుపుకుంటున్నాం. గరిష్ట వరద వస్తే ఇది మునిగిపోతుంది అని ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒకరు ఈ లేఖను ఇచ్చారు. అందువల్లే అనుమతిని జారీచేయలేమని ఆయన స్పష్టం చేశారు. అయినా టెండర్ అంచనాలను రూ.5 కోట్ల నుంచి రూ.8.9 కోట్లకు పెంచి నిర్మించారు.
ఇందుకోసం ఇద్దరు బిడ్డర్లు రాగా, ఒకరిని ఉద్దేశపూర్వకంగా తప్పించారు. ప్రజావేదిక అన్నది అవినీతితో కట్టిన అక్రమ నిర్మాణం. రేపు పొద్దున ఈ తప్పును మరొకరు చేయకుండా మేం ఆదర్శంగా నిలుస్తాం. అందుకోసం ప్రజావేదికను ఎల్లుండి నుంచి కూలగొడతాం. అక్రమ కట్టడాల తొలగింపును ఇక్కడి నుంచే ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఎవరైనా సామాన్యులు ఇలాంటి బిల్డింగ్‌ను కట్టి ఉంటే ఇప్పటికే తొలగించేవాళ్లని చెప్పారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలు చేపడితే బాధగా అనిపించదా? అని అధికారులను జగన్ నిలదీశారు.