గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (12:10 IST)

ఏపీలో ఆసరా నిలిపివేత... కరోనా మృతుల కుటుంబాలకు కూడా...

కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్న వారికి ఆసరా పథకం కింద ఇస్తూ వచ్చిన రూ.2 వేల ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వంపై ఆర్థికభారం పెరిగిందని, దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఆసరా పథకాన్ని నిలిపివేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 
 
కొవిడ్ నుంచి కోలుకున్న అనంతరం రెండు వారాలపాటు ఇంట్లోనే ఉండి బలవర్థకమైన ఆహారం తీసుకునే ఉద్దేశంతో ఏప్రిల్ నెలాఖరులో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి రూ.2 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించింది. ఇందుకోసం మే 4వ తేదీ వైద్య ఆరోగ్య శాఖకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఆ వెంటనే బాధితులకు చెల్లింపుల కూడా చేశారు. అలా మొత్తం రూ.20 కోట్లు చెల్లించారు.
 
అయితే, జులై నుంచి మాత్రం ఈ చెల్లింపులు నిలిపివేశారు. మరోవైపు క్వారంటైన్ కేంద్రాలు తగ్గి కోవిడ్ సంరక్షణ కేంద్రాలు పెరిగాయి. హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నవారు పెరిగారు. దీంతో ఆసరా ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్టు తెలుస్తోంది. 
 
ప్రభుత్వ ఆదేశాలతో గత నాలుగు రోజులుగా ఆసరా చెల్లింపులు చేయడం లేదని అనంతపురం జిల్లా కలెక్టర్ చెప్పినట్టు జిల్లా సమాచారశాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా కోవిడ్ వైరస్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు కూడా రూ.15 వేల ఆర్థికసాయాన్ని చాలా చోట్ల అందించడం లేదని సమాచారం.