బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వాడ్ని పడగొట్టాలి అన్న ఆశయమే పవన్‌లో కనిపిస్తుంది : రఘురామకృష్ణంరాజు

raghurama krishnam raju
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ - జనసేన కూటమి పార్టీలు కలిసి పోటీ చేయనున్నారు. శనివారం ఈ రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ఇరు పార్టీలు పోటీ చేసే సీట్ల వివరాలను ప్రకటించారు. ఈ రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా... టికెట్లు దక్కని కొందరు ఆశావహులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. 
 
ఆగ్రహ జ్వాలలు లేవు, ఏమీ లేవు... అందరూ హ్యాపీగా ఉన్నారు అని వెల్లడించారు. ఇవాళ టికెట్లు పొందిన వారిలో ఎక్కువమంది విద్యావంతులు ఉన్నారని, మహిళలు కూడా గణనీయ సంఖ్యలో ఉన్నారని వివరించారు. యువతకు అత్యధిక శాతం సీట్లు ఇచ్చారని రఘురామ కొనియాడారు. అయితే, ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉండడం సహజమేనని అభిప్రాయపడ్డారు.
 
'సీట్ల పంపకం నేపథ్యంలో పవన్ కల్యాణ్‌ను దత్తపుత్రుడు అని, ప్యాకేజి స్టార్ అని రకరకాలుగా హింసించాలని చూసినా... ఆయన అర్జునుడి తరహాలో తన లక్ష్యం పైనుంచి దృష్టి మరల్చకుండా ముందుకు పోతున్నారు. తన గురవైన ద్రోణాచార్యుడు చెట్టు కనిపిస్తోందా, పిట్ట కనిపిస్తోందా అంటే... అర్జునుడు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తోందని ఎలా అన్నాడో, నేను వాడ్ని పడగొట్టాలి అన్న ఆశయం మాత్రమే నాకు కనిపిస్తోందని పవన్ కల్యాణ్ అంటున్నాడు. నా పార్టీ అధ్యక్షుడు తాను అర్జునుడుని అని సరదాగా చెప్పుకుంటాడు కానీ... నిజమైన అర్జునుడి స్ఫూర్తి నాకు పవన్ కల్యాణ్‌లో కనిపిస్తోంది" అని రఘురామ వివరించారు.