శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (12:19 IST)

ఈ బోటు ప్రమాదం కూడా అవినీతి వల్లే జరిగిందా సీఎం గారూ : నెటిజన్ల ప్రశ్న

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది వరకు ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది వరకు గల్లంతయ్యారు. దీనిపై నెటిజన్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంధిస్తున్న ప్రశ్నలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు అలా స్పందించక పోవడానికి బలమైన కారణం లేకపోలేదు. 
 
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దేవీపట్నం వద్ద బోటు ప్రమాదం జరిగింది. అపుడు విపక్షనేతగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్లే ఘోరాలు జరుగుతున్నాయంటూ, దేవీపట్నంలాంచీ ప్రమాదంపై జగన్ ట్వీట్ చేయగా, అప్పట్లో దాన్ని 'సాక్షి' పత్రిక ప్రచురించింది. ఇప్పుడా క్లిప్పింగ్ మరోసారి వైరల్ అయింది. సీఎం హోదాలో ఉన్న జగన్, ఏమంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 
నాడు ప్రభుత్వ అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన, ఇప్పుడు కూడా అదే విషయాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఆదివారం నాడు ప్రమాదం జరిగిన లాంచ్ ప్రయాణానికి అనుమతి లేదని స్వయంగా హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించడంతో, అసలు ఈ బోటు అనుమతి లేకుండా ఎలా బయలుదేరిందని అడుగుతున్నారు. అధికారులు లంచాలు తీసుకుంటున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.