అది వెలికి తీస్తే సంచలనమే... 214 అడుగుల లోతులో బోటు
తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు మందంలోకి పడిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. ఈ బోటును బయటకు తీస్తే అది సంచలనమే. ఈ బోటును బయటకు తీసే ప్రయత్నాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.
గోదావరిలో 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోనార్ వ్యవస్థ ద్వారా ఈ బోటు ఆచూకీ కనుగొనడం సాధ్యమైంది. సుధీర్ఘంగా శ్రమించిన ఉత్తరాఖండ్ విపత్తు దళం.. చివరికి ఆచూకీ కనుగొంది.
వరద నీరు, సుడిగుండాల కారణంగా బోటును బయటికి తీయడం క్లిష్టంగా మారింది. అయితే.. ముంబై మెరైన్ నిపుణుడు సౌరవ్ భక్షి, కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం, మత్స్యకార బృందం ఆధ్వర్యంలో బోటును వెలికితీతకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇప్పటివరకు 34 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించగా.. బోటు బయటకు తీస్తే మిగిలిన 13 మృతదేహాలు లభ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇదిలావుంటే.. ఓ మృతుని జేబులో ఉన్న ఫోన్‌లో జియో సిమ్ నెం: 6304341457 ఉంది. పరుశువాడ శ్రీకృష్ణ మోహన్ పేరుతో సిమ్ కార్డ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఫోన్ నెంబర్ ఆధారంగా మృతుడి.. బంధువులు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.