బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జనవరి 2021 (07:48 IST)

'సుప్రీం' చెంతకు చేరిన ఏపీ పంచాయతీ : సానుకూల తీర్పుపై ఆశలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల అంశం ఇపుడు సుప్రీంకోర్టు చెంతకు చేరింది. ఈ ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని ఏపీ సర్కారు మొండిగా వ్యవహరిస్తోంది. కానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనంటూ పట్టుదలగా ఉంది. దీంతో ఏపీ పంచాయతీ మరోమారు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఈ అంశాన్ని ఏపీ సర్కారు సుప్రీంకోర్టు చెంతకు తీసుకెళ్లింది. ఇక్కడ తమకు సానుకూలంగా తీర్పు వస్తుందని ఏపీ సర్కారు భావిస్తోంది. తద్వారా కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ హయాంలో ఎన్నికలు జరపకూడదన్న తమ పంతం నెరవేరుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
 
కానీ, ఏపీలో మాత్రం ఇప్పటికే తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఎంతవరకు జోక్యం చేసుకుంటుందోనన్న ఆందోళనా కూడా ప్రభుత్వ పెద్దల్లో నెలకొంది. 
 
ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే ఏం చేయాలన్న అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఎస్‌ఈసీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరినా సానుకూలంగా స్పందించలేదు.
 
ఇకపోతే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, కలెక్టర్లు పాల్గొనకపోవడంపై కొందరు అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 
 
వీడియో కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చేవరకు ఆగాలని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు సీఎస్‌ శనివారం లేఖ రాశారు. అటు కొందరు మంత్రులు, అధికార పక్ష నేతలు నిమ్మగడ్డపై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తూనే.. ఉద్యోగ సంఘాల నేతలనూ ఉసిగొల్పుతున్నారు. 
 
తొలుత వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని సంఘాల నాయకులు వాదిస్తున్నారు. వారి వైఖరిపై సుప్రీంకోర్టు ఏమంటుందోనన్న ఆందోళన ఉద్యోగ వర్గాల్లోనూ ఉంది. ఏది ఏమైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తే.. ఇష్టమున్నా లేకున్నా స్థానిక ఎన్నికలను నిర్వహించక తప్పదని.. ఉద్యోగులూ ఖచ్చితంగా ఆ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంమీద ఏపీ పంచాయతీ పోరు మరోమారు దేశంలో చర్చనీయాంశంగా మారింది.