మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

తూర్పుగోదావరి జిల్లా మినహా... ఏపీలో కర్ఫ్యూ వేళలు సడలింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే, ప్రజా కార్యక్రమాల కోసం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ సడలింపువుంది. ఈ సమయాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడగించారు. ఈ మేరకు కర్ఫ్యూ వేళలను సడలిస్తూ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం కర్ఫ్యూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉండగా, ఈ వేళలను 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయనున్నారు.
 
అయితే, కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్న విధంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి స్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం తెలిపింది. 
 
షాపులు, రెస్టారెంట్లు తదితరాలు సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. ప్రజారవాణాకు ఉపయోగించే బస్సులు కూడా ఇకపై ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలకు తిరగనున్నాయి. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌పై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కర్ఫ్యూ సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు.