మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (14:46 IST)

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా యడ్యూరప్ప.. బీజేపీ పక్కా ప్లాన్

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ పదవీ కాలం జూలై 23 తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పొడిగించే యోచనలో లేనట్లు కనిపిస్తుండటంతో గవర్నర్ మార్పు కచ్చితమని తెలుస్తోంది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీలో గవర్నర్ మార్పు పెద్ద సంచలనం మారనుంది. ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయాలని బీజేపీ ప్రణాళికలు వేసుకుంటున్న నేపథ్యంలో ఈసారి గట్టి నేతనే గవర్నర్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఇందులో భాగంగా బలమైన నేతగా పేరొందిన యడ్యూరప్పను సీఎం పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించారన్న అపఖ్యాతి కన్నడ ప్రజల నుంచి రాకుండా బీజేపీ అధిష్ఠానం సరికొత్త ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. బిశ్వభూషన్ స్థానంలో ఏపీకి గవర్నర్‌గా పంపించడం ద్వారా యడ్యూరప్పకు సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. ఈ ప్రచారంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. వైఎస్ జగన్‌ సన్నిహితుడని చెప్పుకునే గాలి జనార్ధన్‌రెడ్డికి యడ్యూరప్పకు మంచి సంబంధాలున్నాయి.
 
దీంతో జగన్‌తో సయోధ్యలో భాగంగానే యడ్యూరప్పను ఏపీ గవర్నర్‌గా పంపించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే మరో మూడేళ్లలోపే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీని ఇరుకున పెట్టి తాము బలపడాలన్న ప్లాన్‌లో భాగంగానే బీజేపీ అధిష్ఠానం యడ్యూరప్పను ఏపీకి పంపిస్తోందన్న అభిప్రాయం కొందరు వ్యక్తపరుస్తున్నారు.