బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (08:07 IST)

ఎంత ప్రేమో... రిటైర్ జడ్జి కనగరాజ్ కోసం ప్రత్యేక పోస్టు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ జడ్జి కనగరాజ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రేమను చూపిస్తోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఏపీ ప్రభుత్వం నియమించింది. కానీ, అది వర్కౌట్ కాలేదు. 
 
రమేశ్ కుమార్ చేసిన న్యాయ పోరాటంతో తప్పనిసరి పరిస్థితుల్లో జస్టిస్ కనగరాజ్ ఎస్ఈసీ పదవి నుంచి అర్థాంతరంగా తప్పుకున్నారు. ఇపుడు జస్టిస్ కనగరాజ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈయన కోసం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త పోస్టును సృష్టించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 
 
నిజానికి నిమ్మగడ్డ పదవీ విరమణ తర్వాత కనగరాజ్‌ను మళ్లీ ఆ పదవిలో నియమిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఏపీ సర్కారు ఆయన స్థానంలో మాజీ సీఎస్ నీలం సాహ్నిని నియమించింది. 
 
ఇపుడు జస్టిస్ కనగరాజ్‌ పట్ల సీఎం జగన్ ప్రత్యేక ప్రేమన చూపిస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా ఓ పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం తహతహలాడిపోతోంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ‘పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)ను ఏర్పాటు చేసి దానికి ఆయనను చీఫ్‌గా నియమించనున్నట్టు తెలుస్తోంది. 
 
ప్రజల ఫిర్యాదులకు పోలీసులు స్పందించనప్పుడు, సకాలంలో తగిన న్యాయం లభించనప్పుడు ప్రజలు ఈ పీసీఏను ఆశ్రయించవచ్చు. పీసీఏను ఇప్పటికే పలు రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఏడాది జనవరిలో దీనిని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ పీసీఏను ఏర్పాటు చేసి దానికి జస్టిస్ కనగరాజ్‌ను సారథిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.