గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (07:19 IST)

మహిళా పోలీసుల ఛాతి కొలతలు తీసిన పురుష టైలర్.. ఎందుకు.. ఎక్కడ?

మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే గీతదాటారు. మహిళా పోలీసులకు యూనిఫాం కొలతలను పురుష టైలర్‌తో నమోదు చేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విపక్ష పార్టీలు నేతలు నెల్లూరు జిల్లా పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పైగా, రాష్ట్ర మహిళా సంఘం ఛైర్‌పర్సన్ వాసిరెడ్డ పద్మ సైతం ఈ వ్యవహారంపై ఆరా తీసి, మందలించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా మహిళా పోలీసులకు కొత్త యూనిఫాం దుస్తులు అందించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అయితే ఇది అనుకోనిరీతిలో వివాదానికి దారితీసింది. మహిళా పోలీసులకు ఓ పురుష టైలర్ కొలతలు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాతో పాటు టీవీలో వచ్చాయి. సదరు టైలర్ మహిళా పోలీసులకు కొలతలు తీస్తుండగా ఓ వ్యక్తి తన మొబైల్ ఫోనులో ఫోటోలు తీసి వాటిని ఇతరులకు షేర్ చేశారు. అంతే ఈ వ్యవహారం బయటకు తెలిసిపోయింది. 
 
ఈ ఘటనపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు స్పందించారు. యూనిఫాం కోసం పురుష టైలర్ కొలతలు తీస్తున్నప్పటి ఫోటోలు బయటకు వచ్చాయంటూ మహిళా పోలీసులు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆ  ఫోటోలు తీసిన వ్యక్తిని తాము గుర్తించామని, అతనిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగానీ, ఈ పనిచేసిన పోలీసుల తీరును మాత్రం ఆయన లేశమాత్రం కూడా ఖండించక పోవడం గమనార్హం. కాగా దీనికి సంబంధించిన ఒక ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు సమాచారం.