శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (11:28 IST)

ఇది ఉద్యోగుల ప్రభుత్వం.. మీరు లేకపోతే నేను లేను : ఏపీ సీఎం జగన్

తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఆరో తేదీ అర్థరాత్రి నుంచి చేపట్టాలని భావించిన సమ్మెను ఉపసంహరించుకున్నాయి. శనివారం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటి, ఆదివారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. 
 
ఈ చర్చలు ఫలించడంతో నిరవధిక సమ్మెను ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా ఆదివారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వం. ఉద్యోగులు లేకపోతే నేను లేను. పీఆర్సీ విషయంలో ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని కోరారు. 
 
తాను మనస్ఫూర్తిగా నమ్మేది ఒకటేనని, ఉద్యోగులు లేకపోతే తాను లేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల మద్దతు ఉంటేనే ఏదైనా చేయగలుగుతానని చెప్పారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం అని ఆయన పునరుద్ఘాటించారు. 
 
కరోనా కష్టకాలంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఉద్యోగులు ఆశించిన స్థాయిలో చేయలేకపోయామని, కానీ, చేయగలిగినంత చేశామని చెప్పారు. కానీ భవిష్యత్తులో ఉద్యోగులకు మరెవ్వరూ చేయనంతగా జగన్ చేశాడు అని అనిపించుకుంటానని ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.