శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మార్చి 2021 (18:45 IST)

ఎదురులేని వైకాపా .... వైజాగ్ మున్సిపాలిటీ కైవసం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఎదురులేకుండా పోయింది. తాజాగా విశాఖ నగరపాలక సంస్థ కూడా వైసీపీ ఖాతాలోకే చేరింది. జీవీఎంసీలో 98 డివిజన్లు ఉండగా, 58 డివిజన్లలో వైసీపీ విజయదుందుభి మోగించింది. తద్వారా విశాఖ కార్పొరేషన్ పాగా వేసింది. 
 
అటు, టీడీపీకి 30 డివిజన్లలో విజయం దక్కగా, జనసేన 3 స్థానాల్లో నెగ్గింది. ఇతరులకు 4 డివిజన్లు, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు ఒక్కొక్క స్థానాలు గెలుచుకున్నాయి. అటు, చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లలోనూ వైసీపీనే విజయలక్ష్మి వరించింది.
 
ఇదిలావుంటే, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంది. క్రమంగా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడవుతున్నాయి. సర్వత్రా ఆసక్తి కలిగించిన కడప నగరపాలక సంస్థను వైసీపీ చేజిక్కించుకుంది. 
 
కడప కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా, వైసీపీ తిరుగులేనిరీతిలో 48 డివిజన్లలో విజయభేరి మోగించింది. టీడీపీ ఒక్క డివిజన్‌తో సంతృప్తి పడింది. ఇతరులకు ఒక డివిజన్‌లో విజయం లభించింది. 
 
అటు కర్నూలు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. కర్నూలు నగరపాలక సంస్థలో 52 డివిజన్లు ఉండగా, వైసీపీ 41 స్థానాల్లో నెగ్గగా, టీడీపీకి 8, స్వతంత్ర అభ్యర్థులకు 3 స్థానాలు లభించాయి.
 
ఇక, కార్పొరేషన్ల వారీగా ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఇలా ఉన్నాయి....
విజయవాడ (64)-వైసీపీ 23, టీడీపీ 10
గుంటూరు (57)-వైసీపీ 44, టీడీపీ 9, జనసేన 2
విశాఖపట్నం (98)-వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 4, ఇతరులు 6
ఒంగోలు (50)- వైసీపీ 41, టీడీపీ 6, జనసేన 1, ఇతరులు 2
చిత్తూరు (50)- వైసీపీ 46, టీడీపీ 3, ఇతరులు 1
తిరుపతి (50)- వైసీపీ 47, టీడీపీ 1
కడప (50)- వైసీపీ 27... ఇతర పార్టీలు ఇంకా బోణీ చేయలేదు.
కర్నూలు (52)- వైసీపీ 41, టీడీపీ 8, ఇతరులు 3
అనంతపురం (50)- వైసీపీ 48, ఇతరులు 2
విజయనగరం (50)- వైసీపీ 24, టీడీపీ 1
మచిలీపట్నం (50)- వైసీపీ 14, టీడీపీ 2, జనసేన 1